పుట:Aliya Rama Rayalu.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గరవినాశ' మనుగ్రంథమునందు తురుష్కుల మునుమునందును రాచవారి మునుమునందును బెక్కండ్రు మడిసిరిగాని తుదకు తురుష్కులమునుము వెనుదీసె ననివ్రాయబడి యున్నది. అదియెట్టిదైనను భయంకరమైనసంగ్రామము ప్రారంభమయ్యెను. రామరాయ లెంతమాత్రమును భయపడక వృద్ధు డయ్యును నొకయువకునివలె నావేశపరవశుడై తన సైన్యములను బ్రోత్సహింప జేయుచు యుద్ధోన్ముఖుడై యుండెనని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. రామరాయలు తన సైన్యములను మూడుభాగములుగా విభజించి కుడిభాగమును తిరుమలరాయలును, ఎడమభాగమును వేంకటాద్రియును, మధ్యభాగమున దానును గైకొని యెదురుగ రెండువేలయేనుగులను, అచటచట వేయిఫిరంగులను మొదటి పంక్తిలో నుండునటుల నియమించె నట. విజయనగరసైనికులు దిగంబరులుగనుండి శత్రువులకు జులకనగా బట్టువడకుండునటుల యొడలినిండ నూనె పూసికొని యుండిరని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. వీరివలెనె సుల్తానుల సైన్యములు మూడు భాగములుగా విభాగింపబడి కుడిభాగమున ఆలీఆదిల్‌షా యుండి వేంకటాద్రి సైన్యముల నెదిరించుటకును, ఎడమభాగమున ఇబ్రహీమ్‌కుతుబ్షాయును, ఆలీబరీదుషాయును నుండి తిరుమలరాయలసైన్యముల నెదిరించుటకును, మధ్యభాగమున హుస్సేనునిజాముషాయుండి రామరాయల నెదిరించుటకును నేర్పాటుచేసికొని నిలిచిరట. ఖురాసానీ విలుకాండ్రధిష్ఠించిన