పుట:Aliya Rama Rayalu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టదు. ఇయ్యవివట్టికల్పనలుకాని సత్యములగు కారణములు గావు. హీరాసుఫాదిరి వ్రాసినట్లు కడపటజరిగిన యుద్ధములలో హిందువులు మహమ్మదుమతస్థుల మశీదులు మొదలగువాని జెఱచి యవమానపఱచుటయుగూడ గారణములు గావు. దక్కనుసుల్తానులరాజ్యాంగ వ్యవహారములలో నితడుజోక్యము కలిగించుకొని తానుజయశీలుడై వారినదిమిపట్టి యుంచుటయె ప్రధానకారణముగా గ్రహింపవలసియుండును గానిమఱియన్యము కాదు.

కారణమెద్దియైనను ఆలీ - ఇబు - అజీజువ్రాసినట్టు హుస్సేనునిజాముషా యైననేమి, మహమ్మదుకాశిం ఫెరిస్తావ్రాసినట్లు ఆలీఆదిల్‌షాయైననేమి దక్కనుసుల్తానుల నేకీభవింపజేయుటకై గోల్కొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా యిందుకు బ్రయత్నించినటుల ప్రేరేపించిరి. ఇబ్రహీమ్‌కుతుబ్షా ప్రయత్నములు తుదకు ఫలించినవి. హుస్సేనునిజాముషా తనకూతురు చాందుబీబీని విజాపురసుల్తానగు ఆలీఆదిల్‌షాకిచ్చి పెండ్లిచేయుటకును, ఆదిల్‌షాచెల్లెలగు 'ఫలాబీబీహద్యసుల్తానా' అనునామెను హుస్సేనునిజాముషా పెద్దకుమారుడగు షహజడామూర్తజాకు నిచ్చి పెండ్లిచేయుటకును, షోలాపురము కట్నముగా నిచ్చుటకు నేర్పాటుచేసి గోల్కొండసుల్తాను అహమ్మదునగర విజాపురసుల్తానుల కిర్వురకు బొత్తు కలిపెను. అహమ్మదునగరసుల్తానగు హుస్సేనునిజాముషా తన కొమార్తెలలో మరియొకకొమార్తెను గోల్కొండసుల్తానగు