పుట:Aliya Rama Rayalu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గన్పట్టుచుండలేదు. శిశునాగవంశము, శృంగవంశము, చళుక్యవంశము, కలచుఱివంశము, చరిత్రమునుబట్టి వేఱ్వేఱు వంశము లనిస్పష్టపడుచుండగా వీనినన్నిటిని నేకవంశముగా వర్ణించుట చూడగా విజయనగరసామ్రాజ్యమును బరిపాలించిన పూర్వవంశముల వారివలెనె వీరివంశముయొక్క ప్రాశస్థ్యమును ప్రకటించుటకై కవి ప్రయత్నించినట్లు గన్పట్టుచున్నది.

కాని, పండ్రెండవ శతాబ్దిమధ్యమున బసవేశ్వరుని వీరశైవమతము నెదుర్కొని ప్రాణముల గోల్పోయిన బిజ్జలుని వంశమువాడయిన గావచ్చునని యూహించుటకుగూడ ప్రతిబంధక ప్రమాణము లగపడుచున్నవి. హైహయాన్వయ మని శాసనములలో వక్కాణింపబడిన కలచుఱి వంశములోనివాడు బిజ్జులుడని పెక్కుశాసనములు దెలుపుచున్నవి. ఈబిజ్జలరాజు 1150 మొదలు 1162 వ సంవత్సరమువఱకు రాజ్యపరిపాలనము చేసిన చాళుక్యత్రైలోక్యమల్లుని సేనాధిపతిగా నుండి, 1162 వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వ రత్వమును దానే యపహరించి 1167 వ సంవత్సరమున జంపబడుట సుప్రసిద్ధమైన చరిత్రాంశమై యున్నది. వీనితరువాత సోమేశ్వరుడు, సంకాముడు, అహవమల్లుడు ననుమూవురు కాలచుర్యరాజులు 1182 వ సంవత్సరము వఱకు బరిపాలించిరి. తరువాత నీరాజ్యమును చాళుక్య నృపతి యగు నాల్గవ సోమేశ్వరుడు జయించి పరిపాలించె ననుటకూడ సుప్రసిద్ధమైన చరిత్రాంశమె.