పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౦ - ఆశాభంగము

53

తిరుగుబాట్లు జేయుచుండుట, ఒకవైపు రాజ్యములో శివాజీ కొల్లగొట్టుచుండుట-వీనిచేత ఎల్లవారును తన్ను దూషించు చుండఁగా సిద్దిమసూదు చాల చీకాకుపడియుండెను. ఖజానా ఖాళీగానుండెను. ఇట్టిసందర్భములలో శివాజీతో సంధిచేసికొనుట మేలని ఆతఁడు తలంచెనుగాని దిలిరుఖాను అట్టిచర్య అనవసరమనియు మహారాష్ట్రులను శిక్షించుటకు మొగలాయీ సైన్యము సిద్ధముగా నున్నదనియు ధైర్య మొసంగెను. కాని దేశముండిన సంక్షోభములో సిద్దిమసూదు దిలిరుఖానునకు తెలియనీయక శివాజీకి జాబువ్రాసెను. “మనము ఇరుగుపొరుగువారము, మొగలాయీలు మన కుభయులకును శత్రువులు. మనమిరువురునుకలసి వారిని తఱుమవలెను” - అని.

ఈవిషయము తెలియఁగానే దిలిరుఖాను చాల కోపపడెను. బిజాపురముమీఁదికి దండెత్తెను. ఈకాలమున నొక విశేషము జరిగినది. శివాజీకొమారుఁడు శంభూజీ తండ్రికి లోఁబడక వ్యర్థుఁడుగా నుండెను. నీతిరహితుఁడై తిరుగుచుండెను. శివాజీ అతనిని పన్హాలాకోటలో ఖైదుచేయఁగా తప్పించుకొనివచ్చి మొగలాయీవారితో చేరెను. దిలిరుఖాను పరమానందభరితుఁడై శంభుజీని సప్తహజారి మన్సబ్దార్ గావించి, ఏనుఁగుతో బహుమానించి ఔరంగజేబుచే సత్కరింపించెను. ఇప్పుడు బిజాపురమును ముట్టడించుటకు దిలిరుఖాను చేయు ప్రయత్నములు తీవ్రము లయ్యెను.