పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

అక్కన్న మాదన్నల చరిత్ర

మసూద్ అనునతఁడు క్రొత్తమంత్రి. ఇతఁడు శివాజీప్రయత్నములను ప్రతిఘటించెను. తానాషాకు శివాజీ క్రొత్తయెత్తులు దుస్సహములుగ నుండెను. మాదన్న బిజాపురమునకు సాయము చేయఁదలంచి సిద్దిమసూదునకును అతని బిజాపురశత్రువులకును సంధిగావింప నారంభించెను. అంతఃకలహములు అడఁగిన యెడల శివాజీయిచ్చెడు లంచము లేమిచేయఁగలవు? బిజాపూరు వారు సైన్యమునకు జీతము లీయలేకుండినందున వారు తిరుగఁ బడునట్టుండిరి. మాదన్న ఆలోచించెను. ఆజీతములను గోలకొండనుండి తానాషాచేత నిప్పించి సైన్యమును సిద్దిమసూదునకు అనుకూలముగచేసి సైనికుల తిరుగుబాటు తప్పించుటకును శివాజీని కొంకణమునుండి వెలికి రానీయకుండుటకు శివాజీ మీఁదికి బిజాపురమువారు దండెత్తుటకును కావలసినంత ధనసహాయము చేయుటకు వాగ్దానము చేసెను. ఈ యుపాయము మీఁద ఆడిల్‌షాహిసర్దారులు ఇరువదియైదువేల గుఱ్ఱపుదళముతో లెక్కలేని కాల్బలముతోను శివాజీమీఁదికి తయారగు చుండిరి.

కాని ఇంతలో పరిస్థితులు మాఱినవి. మొగలాయీ సేనాధిపతి యెత్తులవలన మాదన్న ప్రయత్నము నెఱవేఱలేదు. దిలిరుఖాను మొగలాయి సేనాధిపతి. ఇతఁడు బిజాపురమును ఓడించి 1677 నవంబరులో సిద్దిమసూదునకు చాల యవమూనకరమగువిధమున సంధిచేసికొనెను. తనయూరిలో అంతఃకలహములు, ఆఫ్ఘనుసిఫాయీలు ప్రతిదినమును జీతము లడుగుచు