పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౦ - ఆశాభంగము

51

నీతి పునాదిలేని సౌధమువలె నేలఁగూలెను. తానాషా శివాజీ శీలమును చక్కగా నెఱింగెను. శివాజీకి దక్షిణదిగ్విజయమునకు వలసినద్రవ్యమును వస్తువులను తా నొసంగియుండియు గోలకొండలో తానును తనమంత్రులును వజీర్లును అట్లు మర్యాద చేసియుండియు దక్షిణదిగ్విజయమున శివాజి తనతండ్రికి పూర్వముచెందని రాజ్యములను తానాషాకు తానిచ్చుటకు ఒప్పుకొని యుండియు తుదకు ఇట్లు గోష్పాదమంత భూమియైన నీయక పూర్తిగా ఏమియునెఱుఁగని యట్లుండుట ఎల్లవారికిని ఆశ్చర్యకరముగానుండఁగా తానాషాకును అక్కన్న మాదన్నలకును ఆశ్చర్యమగుటలో నాశ్చర్యములేదు. తాను జయించిన కోటలలో నొకటిగాని, తానుగ్రహించిన ధనములో కొంత మరలగాని, తాను కొల్లగొట్టినదానిలో కొంతయైననుగాని ఇచ్చుట, ఏదియు శివాజి తలపెట్టలేదు. దోఁచిన ధనమంతయు తానే గ్రహించెను; ఆక్రమించిన భూమినంతయు తనయధీనమందే యుంచుకొనెను. అధికారమంతయు తానే చెల్లించుకొనుచుండెను. జగడమాడు భార్యలు, చెప్పినమాట విననికుమారుఁడు, నిర్వహింపవలసిన కార్యభారము అపారముగానుండుట - వీనిచే శివాజీమాట నిలుపుకొన లేకపోయెననుట ఇందులకు చాలిన సమాధానముగా కనఁబడదు.

గోరుచుట్టుపై రోఁకటిపోటుగా శివాజీ మఱియొక ఎత్తు ఎత్తెను; లంచములిచ్చి బిజాపురమును స్వాధీనము చేసికొన యత్నములు చేయసాగెను. ఇప్పుడు బిజాపురములో సిద్ది