పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



ప్రకరణము ౮ - శివాజీ గోలకొండ ప్రయాణము

క్రీ. శ. 1677 సంవత్సరము జనవరినెలలో శివాజీ రాయఘరునుండి బయలుదేరెను. ఆతనితో పలువురు బయలుదేరిరి. నేతాజీఫాల్కర్ అనునతఁడు పదేండ్లకాలము మహమ్మదీయులలో కలసియుండి ఢిల్లీలో కొలువుచేసి మహారాష్ట్రదేశమునకు వచ్చియుండెను. ప్రాయశ్చిత్తముచేసికొని మరల నీతఁడు హిందువయ్యెను. ఇతఁడును ఇట్టివారు కొందఱును శివాజికి తోడై బయలుదేరిరి.

శివాజీసైన్యము హైదరాబాదు రాజ్యపు ఎల్లలలో ప్రవేశించినది. వెంటనే తనసైనికులకు ఎచ్చటను ఎవరికిని ఎట్టి హానిగాని కలిగింపరాదని గట్టియాజ్ఞ నొసంగెను. ఇతరత్ర చేయునట్లు దోపిళ్లు ఇచ్చట పనికిరావనెను. ఎల్లవారితోను స్నేహమర్యాదలు పాటింపవలసినదని కట్టడచేసెను. ఇందుచేత నాతని వెంటవచ్చిన ఏఁబదివేల సైన్యమును సాధువులవలె గోలకొండరాజ్యమున ప్రయాణ మొనర్చిరి.

ఫిబ్రవరినెల వచ్చినది. శివాజీ ససైన్యుఁడై గోలకొండను సమీపించెను. తానాషా శివాజీకి ఎదురేగి తోడ్కొని రాఁదలంచెను. ఆవార్త విని శివాజీ నివారించెను. ‘తానాషా సుల్తానుగారు చాలదొడ్డవారు. నాకన్నను చాలపెద్ద. నావంటి చిన్నవానికి ఆయన ఎదురు రాకూడదు’ అని యామహావీరుఁడు పలికెను. కాని వాస్తవముగా వయసులో శివాజీయే పెద్ద