పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
38
అక్కన్న మాదన్నల చరిత్ర

జరిపెను. బిజాపురమునకును శివాజీకిని సఖ్యము కలిపినవాఁడు తానేగదా. శివాజీకి మాదన్నకడకుండి రాయబారముపోయి గోలకొండవారికిని మహారాష్ట్ర నేతకును సఖ్యము కుదిరినది. మాదన్న సంవత్సరమునకు ఒకలక్షహొన్నులు శివాజీకి గోలకొండను కాపాడుట కిచ్చుట కొప్పుకొనెను. ప్రహ్లాదనిరాజీ అను మహారాష్ట్రుని శివాజీ తనరాయబారిగా గోలకొండకు పంపెను.

శివాజీకికూడ గోలకొండవైభవమును చూడ వేడుకాయెను. హైదరాబాదునకేఁగు తనరాయబారి కాతఁడు తనయభిప్రాయమును తెలిపెను. ప్రహ్లాదనిరాజీ అందులకు తగిన సంవిధానమును కుదుర్పుమని మాదన్నను వేడెను. అప్జల్ ఖానును కూల్చినవానితో ఏకాసనమందు కూర్చుండిన నేమగునోయని తానాషా మొదట భయపడెను. ప్రహ్లాదనిరాజీ చాలనమ్మకము కలుగునట్లు పలికెను. మాదన్నయు శివాజీ తమకుద్రోహ మొునర్పఁడనియు నాతనికి మొగలాయీలే వైరులనియు దృఢముగా తానాషాను నమ్మించెను. పైగా శివాజీతో ముఖాముఖిగా మాటలాడుటవలన పెక్కు అనుకూలము లున్నవనియు తెలిపెను. తానాషా సమ్మతించెను. శివాజీతరఫున ప్రహ్లాదనిరాజీ తమదక్షిణ దేశవిజయములలో కొంతభాగము తానాషాకిచ్చుట కొప్పుకొనెను.