పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౩ - తానాషా పూర్వచరిత్ర

19

ర్తము. రాచనగరులోని గందరగోళము ఊరంతయు తెలిసియుండినది. సంతోషముగా నేవో మాటలాడుకొనుచుండి గురువు తటాలున నేలమీఁదనుండి ఎఱ్ఱని మట్టిముద్దను తీసికొని అబుల్‌హసనుయొక్క కాలివ్రేళ్లకు పాదములకును పారాణివలె నలంకరించెను; పరిహాసముగా నవ్వుచు ‘నేను నిన్ను పెండ్లికొమారునివలె నలంకరించుచున్నాను’ అని పలికెను. ఏలయన వారిలో వివాహానంతరము పెద్దలు పెండ్లికొమారుని ఆశీర్వదించువిధమిది. ఇదేమని చుట్టునుండినవారు ఆశ్చర్యపడిరి. ‘ఏమో! భగవంతుఁడు నాకీబుద్ధిని పుట్టించినాఁడు’ అని ఆమహాత్ముఁడు బదులు చెప్పెను.

ఆమఱునాఁడు రాజాధికారులు అబుల్‌హసనుకొఱకు వెదకుకొనివచ్చి గురుసన్నిధినుండి తోడ్కొనిపోయి, అతనికి, సయ్యదుసుల్తాను శరీరమునుండి లాగివేసిన వివాహమంగళవేష మిచ్చి, ఉజ్జ్వలాలంకృతమైన మహోన్నతాశ్వముపై నెక్కించి, దివిటీలతోను సంగీతాదికములతోను ఉరేగించి రాజుకొమార్తె నిచ్చి వైభవముగా వివాహము గావించిరి. ఇదంతయు నాతఁడేదో స్వప్న మాయగా తలఁచెను. వివాహానంతరము గురువును దర్శించి ఆతనిపాదములలో వ్రాలెను. ‘ఈప్రపంచమే ఇటువంటిది’ అని ఆతనిగురువు బోధించెను. ఈమహానుభావుఁడే, నాటి పెండ్లికొడుకే నేటి తానీషా, ఆంధ్రులకు రామదాసచరిత్రమున చిరపరచితుఁడైన ‘తానీషానవాబు’. నిరంతరము వేదాంత వినోదములలో ప్రొద్దుపుచ్చుచుండినందుచేత నీతనికి తానాషా