పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

అక్కన్న మాదన్నల చరిత్ర


అనఁగా నిత్యసంతోషి యగురాజు అని ప్రసిద్ధివచ్చినది. మననోట తానీషాయైనది. కాని ఆయనపేరు అబుల్‌హసౝ; కుతుబ్‌షా అనునది గోలకొండసుల్తానుల పరంపర పేరు.

సుల్తానుయొక్క అల్లుఁడైన తర్వాత ఈయన సింహాసనమునకు వచ్చినదొక విచిత్రకథ. క్రీ. శ. 1671, ఏప్రిలు 21వ తారీఖున అబ్దుల్లాసుల్తాను మరణించెను. తత్క్షణమే సింహాసనమునకు తగవులు ప్రారంభమైనవి. సయ్యదు అహమ్మదు, గతించిన అబ్దుల్లా సుల్తానునకు తాను పెద్దయల్లుఁడైన కారణమున సింహాసనము తనదని లేచెను. అతనిభార్య, మాసాహేబు, తనచుట్టునున్న బానిసలను వైదేశసేవికలను, సాయుధలను గావించి అంతఃపురమందు తనహక్కులను కాపాడుకొనుటకు సంసిద్ధురాలుగా నుండెను. కాని ప్రయోజనము లేకపోయినది. సయ్యదు అహమ్మదునకు ఆతనికఠినకర్కశస్వభావముచే శత్రువు లనేకు లేర్పడియుండిరి. పైగా నీతఁడు పరిపాలనయందు సమర్థుఁడగుటచేత ఉద్యోగులు సహింపలేకయుండిరి. అబుల్‌హసను యొక్క వేదాంతవినోదస్వభావము లంచగొండ్లైన రాజకీయులకు చాల అనుకూలముగా నుండెను. అతనిని సుల్తానుగా సింహాసనమెక్కించిన తమకు విశేషలాభముండునని వా రనుకొనసాగిరి. అంతఃపురములోను కోట దర్బారులోను కొంత జగడమైనది. సయ్యద్‌ముజఫర్ అనుసేనాపతియు, మూసాఖాౝ అను మహల్దారును (అంతఃపురరాజగృహాధికారి) మఱికొందఱు ఉద్యోగులును ఏకమై ఆకస్మికముగా సయ్యద్ అహమ్మదును