పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

అక్కన్న మాదన్నల చరిత్ర

తపస్సంపన్నులవంశమున జనించినవాఁడు. బందేనవాజ్ హజరత్ అను తపస్వియొకఁడు ఢిల్లీనగరమునుండి బయలుదేరి అల్లాయుద్దీను సుల్తాను కాలమున గుల్బర్గాకువచ్చి అచ్చటనే యుండి సమాధినందెను. ఈతనివంశమువా రందఱును గొప్ప వేదాంతులై స్వాములని ప్రసిద్ధినందిరి. వీరిది సూఫీమతము. తాము మహమ్మదీయులే యైనను తమవారియందు వీరికి పక్షపాతము లేదు. ఏమతమువారైనను సరియే వేదాంతులైన చాలును. ఇతనివంశమున పుట్టినవాఁడే సయ్యద్ రాజుకొత్తాల్, అబుల్‌హసౝ గురువు. ఈమహర్షి పెద్దకొమారుఁడు అక్బరుషా, ‘బడేసాహేబ్’ అని బిరుదమువహించినవాఁడు. తండ్రివలెనే కవిశిఖామణి. ఈతఁడు ఆంధ్రభాషయందు శృంగారమంజరి యను నొక ‘రసమంజరి’వంటి కావ్యమును రచించెను. అది పోయినదిగాని దాని సంస్కృతానువాదము నేటికిని కలదు. ఇతఁడును అబుల్‌హసనునకు గురువే.

నిరంతరము ఈమహాశయులమాటలు వినుచు వేదాంతిగా అబులహసను కాలము గడపుచుండెను. దీనినెల్ల నీచసహవాసముగా భావించి ధనికు లెవ్వరును ఈతనితో చేరరైరి. అబుల్‌హసనునకు ఐహికవాంఛలు జనింపలేదు; వేదాంతము పట్టువడియుండెను. గురువుమీఁద నీతనికి అపారభక్తియు ఇతని యందు గురువునకు చాలవాత్సల్యమును ఏర్పడియుండినవి.

ఒక దినము గురుశిష్యులగోష్ఠిలో సుల్తానుకుమార్తె వివాహప్రస్తావము వచ్చినది. ఆమఱునాఁడే వివాహముహూ