పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

అక్కన్న మాదన్నల చరిత్ర

ఎచ్చట రొట్టె దొరకునాయని వెదకుచు చంద్రునిచూచి చంద్రుఁ డేల రొట్టె కారాదని కోరుచుండెను. పాదుషావారి కరణములకు కరణీయములు లేవాయెను. కాని ప్రధానకరణము మాత్రము సంవత్సరమంతయు రంజానే యని వ్రాసికొనసాగెను. ఖోరానులో ‘భోజనము చేయుము’ అను వాక్యమును చదివి ‘తిండికూడదు-అని యెచ్చటను లేదే’ అని యొకసాయెబు చింతించుచుండెను. దర్జీవాఁడు తన సూదితో సమానమైపోయెను. ఇతరుల నూతనవస్త్రములను కుట్టుటకు బదులు తనమలినవస్త్రమునుపఱచి దానిముందు కూర్చుండి ముష్టి యెత్తసాగెను. సాలెవాఁడు వస్త్రమునకు చాయమార్చుటకు బదులు తానే చాయమాఱిపోయెను. రొట్టెల యంగడివానికే రొట్టె చిక్కుట,లేదు. చిల్లరసామానుల యంగడివాఁడు అంగడి నెత్తివేయుటకు ఆలోచించుచుండెను. వానియంగడిలో తక్కెడయు గుండ్లును తప్ప వేఱులేవు. వడ్రంగి తన ఱంపము ఉలియు చేతఁబెట్టుకొని ఆకాశము చూచుచుండెను. కమ్మరివాఁడు కమ్మనివస్తువేది దొరకునాయని దిక్కులు చూచుచుండెను. మంగలివాని కత్తికి పనిలేదు. వంటవాండ్రందఱకు చాల విశ్రాంతికలిగినది. ప్రొయ్యులలో పిల్లులుకూడ వెచ్చదనము లేమిచే పరుండుటను మానినవి. ఒక యింటినుండి ఏడ్పులు వినవచ్చినవి. పోయి విచారింపఁగా వారి యింటికి బంధువులు భోజనమునకు వచ్చిరని తెలిసినది. ఇంకొకచోట జనులు చాల పరిహాసముచేయుచుండిరి. కారణ మేమనఁగా