పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౦ - క్షామము

101

గడ్డి లేకపోవుటయు. దేశమందు క్షామ మేర్పడెను. మహాధనికులుకూడ స్కంధావారమున దిగులుపడసాగిరి. ఆసంవత్సరము వర్షములు చాల తక్కువయైనందున జొన్నలుగాని రాగులుగాని పండలేదు. పైరు లెండిపోయినవి. పేదలు మాడి పోసాగిరి. ఈలోపల తానాషాకు సహయము చేయుటకు వచ్చిన మహారాష్ట్రసైన్యము మొగలాయీవారికి వచ్చుచుండిన సరఫరాలను పూర్తిగా నడ్డగించి వేసెను. మొగలు సైన్యములోనే అంటువ్యాధులు బయలుదేరినవి. అన్నపానములు లేకయు రోగములు వచ్చియు ప్రతిదినము లెక్కలేనివారు చనిపోవుచుండిరి. చాలమంది సిఫాయీలు కడుపుకోసము తానాషాకడకు పోయిరి. మఱికొందఱు తానాషాతో చేరకపోయినను రహస్యముగా తానాషా సైన్యమునకు సాయము చేయుచుండిరి.

నాటిపరిస్థితులను కొందఱు మహమ్మదీయ కవు లిట్లు చిత్రించిరి.-మొగలాయీవారి దాడిచేత దేశమంతయు పాడై పోయెను. పాతిపెట్టిన ధనములవలె ప్రభువులు ఎచ్చటెచ్చటనో దాఁగియుండిరి. దారిద్ర్యము దేశమందు ప్రబలి కవుల కావ్యములలో ప్రజ్ఞాదారిద్ర్యము కనఁబడుచుండెను. సిఫాయీలకు జలధారకు బదులు అసిధారయు ఆహారమునకు బదులు సంహారమును దొరకుచుండినవి. వైద్యులు తమ వైద్యమును మఱచిపోయి ఆహారమే మహౌషధమని బోధించుచుండిరి. జోస్యుఁడు తనశాస్త్రము ఎవరికిని తన అక్కఱలేనందున