పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

అక్కన్న మాదన్నల చరిత్ర

డిసంబరులో నాతఁడు బిజాపురమును వదలెను. బయలుదేరుచునే, తానాషా తనకు అప్పుపడియున్న పేష్కస్సు తత్క్షణమే చెల్లింప వలసినదని ఫర్మానా వ్రాసెను. ఫర్మానాతెచ్చువారిచేత రహస్యముగా తనరాయబారి కొక జాబువ్రాసి పంపెను. “మనము హైదరాబాదును జయించుటకు ప్రయత్నింపవలెను. త్వరలో మా విజయపతాకలు అచటికి రాఁగలవు. ఇంతలోపల మీరు తానాషానుగుంజి సాధ్యమైనంత ధనమును లాగి మీ యుద్యోగధర్మమును నిర్వహింపవలెను.”

మొగలురాయబారి సాదత్‌ఖాను తానాషాతో అబద్ధములు చెప్పి పాదుషా ఆజ్ఞను ప్రతి యక్షరమును నిర్వహింప సాగెను. పాదుషా కోర్కెలు వర్ణనాతీతములు. తానాషాకడ ధనము లేనందున నాతఁడు తనరత్నాభరణాదులను తాకట్టుగా పంపఁగలనని చెప్పిపంపెను. సాదత్‌ఖాను అందులకు ఒప్పకొనలేదు. ఇంతలో పాదుషా బయలుదేరి వచ్చుచున్నాఁడని తెలియఁగానే తానాషా తానే తాకట్టుగా తనరత్నాభరణాదులను ఒకపెట్టెలోపెట్టి, ముద్రవేసి, మిగిలినపైకము ఎంతవసూలగునో దానిని మూఁడుదినములలో పంపునట్టును తన సదుద్దేశమును పాదుషావారికి తెలుప వలసినదనియు కోరి సాదత్ ఖానుకడకు పంపెను.

రెండుదినములు గడచినవి. పాదుషాకడనుండి బదులు లేదు సరిగదా ఆతఁడు దండువెడలి వచ్చుచున్నాఁడని తెలిసినది. ఇదంతయు మొగలాయీవారి కపటోపాయమని తానాషా