పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౯ - గోలకొండముట్టడి ప్రారంభము

97

గ్రహించి తనయుద్దేశము విఫలమైనదనియు తాను పంపిన తాకట్టును వాపసుచేయుమనియు కోరెను. సాదత్‌ఖాను ఆ నగలు పాదుషావారికి తానుపంపివేసినట్లు బదులు చెప్పిపంపెను. పైగా తాను తనధర్మమును నెఱవేర్చితిననియు ఇప్పడు ఆ వస్తువులకు బదులు తనతలను ప్రాణములను పాదుషావారి పేరు చెప్పి బలివేయవలసినదే యని కూడ వ్రాసెను. తానాషాకు కోపమువచ్చి సాదత్‌‌ఖానుని యింటిని ముట్టడి వేయించెను. సాదత్‌ఖాను సమయోచితముగ సంచరించు నేర్పరిగాన తనది సదుద్దేశమనియు, తన్ను శిక్షించుటచేత పాదుషాగారికి కోపమే యధికమగుననియు, తన్ను వదలిపెట్టిన తాను ఎట్లో పాదుషా వారికి నచ్చచెప్పి తానాషాను మన్నింపించుట కవకాశ ముండు ననియు చెప్పఁగా మెత్తటిమనసువాఁడు గాన తానాషా ఆతని వదలి చాల మర్యాద చేసిపంపెను.

ఇంతలో ఔరంగజేబు బయలుదేరెను. తానాషా కలఁతపడసాగెను. పరిస్థితులు విషమింప సాగినవి. మరల తానాషా పాదుషాకు తానుచేసినదంతయు నపరాధమే యని యొప్పుకొనుచు ఎంతధనమైనను చెల్లింతునని రాయబారమంపెనుగాని అంతయు వ్యర్థమాయెను. పాదుషా తానాషాపై పెక్కు తప్పులువ్రాసెను. తానాషా ఆసలుడిగెను. ఆత్మరక్షణ వ్యూహము పన్నసాగెను. కొలువులో షేక్‌మిౝహాజ్, షారెజ్‌ఖాౝ, అబ్దుల్‌రజాక్‌లారీ, అబ్దుల్లాఖాౝపానీ అనువారలుండిరి. తానాషా గొప్పదండిచ్చి వారిని పాదుషామీఁదికి

7