పుట:Adhunikarajyanga025633mbp.pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్ర్యములుండదగునో నిరూపించుట మొదటిధర్మము. ప్రజలు యోగ్యులగు పౌరులగుటకుగాను ప్రభుత్వము నెరవేర్చవలసిన కార్యక్రమమును సూచించుట రెండవధర్మము. ఏయేవిధముల, ఏయేశుభకార్యనిర్వాహణమునకై, ప్రజాస్వామిక రాజ్యాంగ మేర్పరుపబడుచున్నదో తెల్పుట మూడవధర్మము. శ్రీఅరిస్టాటిలుగారు, ప్రజలజీవితము శోభాయమానముగా జేయుటయే ప్రభుత్వధర్మమనిరి. వారిగురువగు శ్రీప్లేటోగారు, ప్రజలను వారివారివృత్తులందు, ధర్మసూత్రముననుసరించి యుంచుటయే ప్రభుత్వవిధికృత్యమనిరి. మనమిప్పుడు ధర్మార్థకామముల పెంపొందించి, ప్రజలకు మోక్షప్రాప్తికల్గించుటయే, ప్రభుత్వపుధర్మమనిబోధించిరి. ఈకాలపు సాంఘికవాదులు, సమిష్టి వాదులును, ప్రజలనభివృద్ధికి దెచ్చి, వారికి ఆధ్యాత్మిక జ్ఞానసంపాదన కగత్యమగు యవకాశములకల్పించుటయే ప్రభుత్వపునీతియని వాదించుచున్నారు. ఎల్లరును ఈ కాలమందు ప్రజల భాగ్యభోగ్య ఆధ్యాత్మికజ్ఞానాభివృద్ధికై తనసర్వశక్తుల నుపయోగించుటయే, ప్రభుత్వముయొక్క గమ్యస్థానమని అంగీకరించుచున్నారు. ఇట్టి గమ్యస్థానము జేరుట కెట్టిచర్యల, ఏసూత్రములను ప్రభుత్వమవలంబించవలయునో, ప్రజలెల్లరి కామోదనీయముగా నుండునటుల రాజ్యాంగ విధానపు చట్టమందు తెల్పుట శుభప్రదమే యగును.