పుట:Adhunikarajyanga025633mbp.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇట్టి పరిస్థితులందు బడ్జెట్టుపై యధికారము లేకపోవుచో "వస్తునిర్మాతకుల సభ" వారికి ప్రజాప్రతినిధి సభవారితో సమానస్థానము లభింపజాలదుగదా?

శాసననిర్మాణమందును ఈరెండుసభలకు సమానాధికార మొసంగుచో ఈదినములందు రెండుశాసనసభలున్న దేశములందు కల్గుసమస్యలే బయలుదేరునని భయపడనక్కర లేదు. ఇప్పటి సెనెటుసభలందు పూర్వాచారపరాయణులు, వృద్ధులు, మితవాదులు, ధనికుల స్నేహితులు బలముగనుండ "వస్తునిర్మాతకుల సభయందు" వారికి మహాఅయితే సగ భాగపు ప్రాతినిధ్యము కల్గును. కనుక సెనెటుసభకంటె "వస్తునిర్మాతకుల సభ" యే హెచ్చుగా కార్మికుల సమస్యల యెడ సుముఖత జూపుచుండును. ఐనను "వస్తునిర్మాతకుల సభ" వారు బిల్లుల నెంతశ్రద్ధమై తయారుచేసి చర్చించి, అంగీకరించి ప్రజాప్రతినిధిసభ వారికి పంపినను ఆసభయందు సాధారణముగా యజమానుల ప్రతినిధులే అధికసంఖ్యాకులై యుండెదరు కనుక ఆబిల్లులకు సాధారణముగా ప్రతిష్టంభనము జరుగుచుండును. ఈయిబ్బందిని తప్పించవలెనన్న ఈ రెండుసభలమధ్య భేదాభిప్రాయము కల్గుచో వోటరులందు యిరువదవవంతు మంది "రిఫరెండము" కోరుచో ఆబిల్లులను వోటరులసమ్మతిపై తేవలయును. ఈవిధానమువలన ఇప్పటికంటె చులకనగా శాసననిర్మాణము జరుగవచ్చును.