పుట:Abraham Lincoln (Telugu).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"అవును, వివాదము నే గెలిచియిచ్చెద ననుటకు సందేహము లేదు. ఒక ప్రదేశపు జనులనెల్లర దాఱుమాఱు చేయ గల్గుదును. ఆ విధవను ఆపె యాఱుగురు దండ్రిలేని బిడ్డలను రిక్తహస్తుల జేసి న్యాయానుసారముగ వారికి గల యాఱు వందల డాలరుల నీ కిప్పించ గల్గుదును. అయిన నే నట్టి యన్యాయపు పనులు సేయువాడును గాను."

"మీ కెంత వేతన మిచ్చినను జేయరా?"

"నీకు గలదంతయు నా కూడ్చి పెట్టినను నే జేయను. చట్టదిట్టములు సరియని యొప్పుకొను విషయములు గొన్ని నీతిబాహ్యములు గలవని యెఱుంగుము. నీ వివాదమునకు దోడ్పడుదు ననుట గల్ల."

ఈ యుత్తర ప్రత్యుత్తరములకు వ్యాజ్యకా డాగ్రహము పూని,

"మీరు రాకున్న గుడ్డిగవ్వవోయె. మీవంటి న్యాయవాదు లీసీమయందు దండోపతండములు గల"రని నొడివి రభసమున వెడలబోయెను.

లింక నతని నాపి "వేతనము దీసికొనక నీ కొక యాలోచన సెప్పెద వినుము. నీవు చూడ మిక్కిలి చుఱుకైన పనివాడుగ నున్నావు. ఆ యాఱువందల డాలరు లింక నేవిధమున నైన గడింపుము. పొ మ్మ"ని చెప్పి పంపెను.