పుట:Abhinaya darpanamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉగ్రదృష్టి స్సమాఖ్యాతా ఉగ్రాదిషునియుజ్యతే,

తా. లెస్సగా వికసించినదియు, రెండుకనుగొనలందును ఎరుపుగలదియు నైనచూపు ఉగ్రదృష్టి యనఁబడును. ఇది ఉగ్రము మొదలైనవానియందు చెల్లును.

26. విభ్రాంతము :—

చలత్తారాచ విభ్రాంతా దృష్టిర్విస్రంభదర్శనా.

153


మధ్యేచ వికలోత్ఫుల్లా విభ్రాంతా సంభ్రమాదిషు,

తా. చలించుచున్న నల్లగ్రుడ్లు గలిగినదియు, భ్రమించునదియు, ప్రీతిని గనబరుచునదియు, నడుమనడుమ వెలవెలపాటును తేటదనమును గలిగినదియు నైనచూపు విభ్రాంతదృష్టి యనఁబడును. ఇది సంభ్రమము మొదలైనవానియందు వినియోగపడును.

27. శాంతము—:

క్రమమాణపుటా సన్నాకిఞ్చిచ్చఞ్చలలోచనా.

154


చలత్తారా కృతాపాఙ్గా దృష్టిశ్శాంతాశమాదిషు,

తా. మూఁతపడు రెప్పలు గలదియు, కొంచెము చలించునట్టి కన్నులు గలిగినదియు, చలించుచున్న నల్లగ్రుడ్లు గలిగినదియు నైనచూపు శాంతదృష్టి యనఁబడును. ఇది శమము మొదలైనవానియందు చెల్లును.

28. మీలితము:—

దృష్టేరర్ధ వికాసేన మీలితా దృష్టిరీరితా.

155

తా. సగము తెరవఁబడిన కన్నులు గలది మీలితదృష్టి యనఁబడును.

వినియోగము:—

పారవశ్యాదిభావేషు ప్రయోక్తవ్యానిమీలితా,

తా. పరవశత్వము మొదలైన భావములయందు ఈదృష్టి యుపయోగింపఁబడును.