పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

అబలాసచ్చరిత్ర రత్నమాల.

గ్రంధములను మహారాష్ట్రమున వ్రాసెదను. మాయమ్మకు సంస్కృతగ్రంథముల యర్థమువివరించెదను. పురాణము లన్న నామె కధిక సంతోషముగాన నామెకొఱకు పురాణపఠనము చేసి యామెను తృప్తిపఱచెదను. నాకు సంతానము కలుగుట పరమేశ్వరున కసమ్మతమే యయినను నేను నాయక్కబిడ్డలకును, స్నేహితురాండ్రబిడ్డలకును విద్యాబుద్ధులు గఱపెదను. ఇట్లు నేను వారికి నుపయోగపడినయెడల నాజన్మము కొంత సార్థక మగును. నావలె సౌభాగ్యహీన లయ్యును విద్యా గంధములేని యనేక బాలికలు విద్యాయుతుఁడయిన తండ్రితో నేమి తోఁబుట్టువులతో నేనే తగినవిషయములను గుఱించి యేమియు మాటాడుటకుఁ దోఁచక యూరకుండెదరు. నేనెట్లు మౌనముద్ర వహింప నక్కఱలేనందున వారితో నాకుఁ దెలిసిన శాస్త్రవిషయములును, ఇతరవిషయములును ముచ్చటింతును. అందువలన వారికి సంతోషముకలుగును. కాన నాకదియే విద్యవలనఁ గలిగెడి యొక మహానందము.

ఇదియుఁగాక ప్రస్తుత విద్యాభ్యాసమువలన నాకుఁ గొంత ద్రవ్యార్జనశక్తి కలుగును. ఆద్రవ్యమువలన బీదసాదలకు సహాయము చేయుదును. ఏతద్విషయమై నాకును స్వతంత్రత కలుగును.

నా స్వదేశ సోదరీమణు లేయేవిద్య నాయొద్ద నేర్చుకొనఁ గోరెదరో యాయా విద్య నేను వారికి మిగుల శ్రద్ధతో నేర్పెదను. నేను చేయఁదలఁచిన మంచికార్యములలో నిదియే ముఖ్యమైనది.