పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
52
అబలాసచ్చరిత్ర రత్నమాల.

బీరుఁడు రాజ్యము నడుపున ట్లేర్పాటుచేయఁబడెను. బనబీరుని జన్మమువలనే గుణమును నీచమైనదియేగాన వాఁడు తా ననర్హుఁడయినను అదృష్టవశమునఁ దనకు రాజ్యమును రాజపాలకత్వమును దొరుకుటకు సంతసించి యుండక రాజ్యముతనకే శాశ్వతముగానుండు నుపాయము విచారింపసాగెను. ఇట్లు విచారింపఁగా రాజపుత్రుని నెటులయినఁ జంపక తనకుదొరకదని వాఁడు తెలిసికొని యెవ్వఱికి నెఱుక పడకుండ తానేయాపనిని జేయ నిశ్చయించుకొనెను. ఆనీచుఁడు తనకృత్య మించుక బైలపడినయెడల రజపూతు సరదార్లు తనను దెగఁజూతురని యెఱిఁగినవాఁడుకాన పైకిమిగుల సత్ప్రవర్తనగలవానివలె నగుపడుచుండెను. రాజపుత్రుని నెటులయినఁ దానుచంపి యాద్రోహ మితరులపై నిడి సరదార్ల సమ్మతిచేఁ దానేరాజగు నుపాయము నాతఁడు యోచింపుచుండెను.

బనబీరుని మనమునం దిట్టిద్రోహముకలదని యేరికిని సంశయమయినను రాకుండెను; గాని యిట్టిపాపవిచారము బైలపడకుండుట దుస్తరము గాన నాతని దుష్టవిచారమంతయు సమీపమునందుండుమంగలివాఁ డొకఁడు తెలిసికొనెను. వాఁడును పన్నావలెనే ప్రభుభక్తుఁడు. వానికిఁ బనబీరుని పరిపాలనమే యసమ్మతము. బనబీరుఁడు తనదుష్టత్వ మెంతగుప్తముగా నుంచినను, పరమేశ్వరుఁడు ఆపాపమున కంతకును నీ మంగలివాని నొకనిని సాక్షిగా నియమించెను. బనబీరుఁ డేసమయమునం దేమియాలోచన చేసినను బహుయుక్తులచే నీమంగలి యప్పుడే దానిని గని పెట్టుచుండెను.