పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

అబలాసచ్చరిత్ర రత్నమాల.

స్వరూపమువలనే బాహ్యస్వరూపమును మిగుల నందముగానుండును. సాధారణముగా నీ మాసపత్రిక ప్రతి బంగాలీకుటుంబీకులును దెప్పించుచుందురు. వనలతాదేవిచేస్థాపింపఁబడిన ఈ సమాజము వలనను, నీ మాసపత్రికవలనను స్త్రీలు స్వతంత్రముగా నేకార్యమును జేయ లేరను కొందఱి యభిప్రాయము భ్రమయేమనియు స్త్రీలు విద్యనుగాంచి బుద్ధివికాసమునుగాంచినచోఁ బురుషుల సహాయ మెంతమాత్రము నక్కఱలేకయే యనేక సత్కార్యములను గ్రంధరచనలను జేయఁగలరనియు నందఱుకును దెల్లంబయ్యె! వనలతాదేవి స్త్రీలయున్నతినే సదాగోరుచున్నందుకై యనేక యుపాయములను జేసెను. ఆమె మరణమునకుఁ బూర్వము కొన్ని మాసములనుండి విశేషరోగగ్రస్తగా నుండియు నంత:పురమునకు వ్యాసములును, బద్యములును వ్రాయుచునేయుండెను. ఆమె మరణసమయమునందును "అంత:పురము; సుమతీసమితి" యను రెండుశబ్దముల నుచ్చరించి వాని శాశ్వతమును గోరుచుఁ బ్రాణముల విడిచెను.

ఈమెకుంగల గృహకృత్యములయందలి శ్రద్ధయుఁ, బతియందలి యనురాగమును, శిశుపోషణమునందలి నేర్పును మిగుల వర్ణనీయములు. ఈమె సాధారణముగా గృహకృత్యములను దానే నెఱవేర్చుచుండెను. రుగ్ణతలో నుండినప్పుడు సహిత మీమె యింటికిఁ గావలసిన వస్తువులను దానే తెప్పించుచు, నింట నేమివండవలసినదియుఁ దానే చెప్పుచు నింటి యందుండువారి యందఱ సేమము నరయుచుండెను. ఆమె రుగ్ణతలో సహిత మింటి కర్చులను వ్రాయుటమానక తలాపున నొక పుస్తకమును, పెన్సలును నుంచికొనుచుండెను.