పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
236
అబలాసచ్చరిత్ర రత్నమాల.

దర్యరాశినిం గనినతోడనే యాతని చేతులాడక ఖడ్గము చేతినుండి క్రిందఁబడ నాతఁ డాకార్యమును మాని మిగుల దు:ఖముతో మరలిపోయెను. తదుపరి అమీర్ ఖాను దుర్మంత్రము వెల్లడికాఁగా రాజసతి దు:ఖమునకుమితము లేదయ్యెను.

రాజభవనమునం దంతటను దు:ఖమయముగా నున్నను కృష్ణాకుమారి ముఖమునం దెంతమాత్రమును మృత్యుభీతి కానరాదయ్యెను. ఆమె యెప్పటివలె సంతోషముగా నాడుచు, పాడుచుఁ జెలులకు నీతులను బోధింపుచుఁ గాలము గడుపుచుండెను. నీకూఁతును విషప్రయోగమువలనఁ జంపుమని రాణాగారికి అమీర్‌ఖా నాలోచన చెప్పెను. అట్టినీచకృత్యము రాణా గారికి సమ్మత మగుటవలన నొకబంగారుగిన్నెలో విషముపోసి దాని నాయనబిడ్డకడ కంపెను. దానిని కృష్ణాకుమారి సన్నిధికిఁ దెచ్చిన సేవకుఁ డీవిషము మీతండ్రి మీకొఱకుఁ బంపెనుగాన దీనినిమీరు స్వీకరింపవలయునని చెప్పఁగా నాబాల తండ్రియాజ్ఞ శిరసావహించి యావిషపాత్ర నాభృత్యుని చేతినుండి తీసికొని పరమేశ్వరునిఁ బ్రార్థించి తండ్రికి ధనాయుష్య సమృద్ధియగుంగాత యని యావిషము నామె త్రాగెను. విషప్రాశనానంతరమునందు సహితమామె మరణభయము నొందక తనయిష్టదైవమునుఁ బ్రార్థింపుచుండెను. ఇంతలో నామెతల్లి శోకించుట విని యాబాల తల్లి కిట్లు సమాధానము చెప్పెను. "అమ్మా! నీవేల శోకించెదవు? దు:ఖమెంత త్వరగాఁ దగ్గిననంత మంచిది. నేను క్షత్రియవీరుని బిడ్డనుగాన మరణమునకు వెఱవను. ఈశరీరము పుట్టినప్పుడే చావు సిద్ధము. ఇఁక నాచావునకై వగచిన నేమిఫలము" ఇట్టివాక్యములచేఁ దల్లికి