పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226
అబలాసచ్చరిత్ర రత్నమాల.

పాతివ్రత్యమును బాడు చేసికొనక మిగులజాగ్రత్తతోఁగాపాడు కొన్న గుణవతి భాగీరధి యనఁబడును. పాతివ్రత్యము గల వనితకు పరమపద మఱచేతిలోనిదని పెద్దలు పలుకుదురు. పాతి వ్రత్యమును రక్షించుకొన్న వనితలకు నేలోపములును రావు. పాతివ్రత్యమునకు భంగము కలిగించుకొన్నచో బహువిధములయిన బాధ లనుభవింపవలసి వచ్చును. ప్రాణమున కంటె పదిమడుగు లెక్కుడుగాఁ బాతివ్రత్యమునందు ప్రీతి గలిగి కాపాడుకోవలసినది. భూషణముల కెల్ల భూషణము ప్రాతివ్రత్యమే సుమీ ! పాతివ్రత్యమున కంటెఁబడఁతులకుఁ బాలింప వలసిన పదార్థ మొక్కటి లేదు. పాతివ్రత్యమును బాడు చేసికొనిన పాపాత్మురా లొకవేళ సత్కర్మములను జేసినను అవి దుష్కర్మములక్రింద మాఱి తుదకు దు:ఖమును గలిగించునుగాని లేశమయినను సుఖమును గలిగింపవు. పతివ్రతలయొక్క ప్రభావముచేతనే భూతలమంతయు నంతరమున నిలిచియున్నదనియు, పతివ్రతలవిషయమున బ్రహ్మాదిదేవతలు సహితము భయపడుచుందురనియు పెద్దలు పలుకుదురు. పూర్వము మృతినొందిన తనపతిని సావిత్రీదేవి మరల బ్రతికించుకొన్నది కాదా? తనచిత్తశుద్ధినిఁ దెలుపుటకై సీతాదేవి యగ్నిలో దుమికినది గాదా? తనకు హాని చేయవచ్చని కిరాతుని దమయంతీదేవి భస్మము చేసినది గాదా? తనమాంగల్యము నితరులకుఁ దెలియనీయక చంద్రమతీదేవి రక్షించుకొన్నది గాదా? రేణుకాదేవి యిసుకతోఁ గుండను జేసి జలమును దెచ్చినదిగాదా? బృంద తన భర్తవలె ననువర్తింపవచ్చిన విష్ణుమూర్తియొక్క మాయను దెలిసికొన్నది