పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సావిత్రీబాయి ఠాణేకరీణ్.

ఈశూరనారి కర్నాటకములోని బేళగాముజిల్లాయందుండు బేలవాడీయందలి భుయికోటకు నధిపతిగానుండిన యే సాజీభార్య. ఈమె శివాజీ మహారాజు సైన్యములతో యుద్ధముచేసెను.

శివాజీ యొకప్పుడు కర్ణాటకముపైకి దండువెడలెను. అప్పుడాయన తనసైన్యాధిపతియగు దాదోజి నచటిదుర్గములు గెలువ నియమించి తాను తనదేశమున నౌరంగజేబు సైన్యములను గెలుచునిమిత్త మరిగెను. దాదో తాను భుయికోటను గెలిచినచోదాని చుట్టుపట్టులనుండు దుర్గము లల్పశ్రమతోఁ దనకుఁ జిక్కఁగలవని యనుకొని ప్రధమమునందు దానిని ముట్టడించెను. కాని దానిసంరక్షకుఁడగు ఏసాజీ వారికి లోఁబడక వారితో ఘోరముగాఁ బోరెను. ఇట్లు కొంతసేపు సంగ్రామము జరిగినపిదప నేసాజీయుద్ధరంగమునంబడియె. అంత నతని సైన్యములు విచ్చలవిడిగా నలువంకలకుఁ బాఱసాగెను. భర్త యుద్ధమునఁ జచ్చుట విని యతనిపత్ని కొందఱు దాసీలతో యుద్ధభూమికి వచ్చెను. ఆమె యచటికివచ్చి గతప్రాణుఁడైనను చేతిపలుకయు, వాలునువిడువని తనపతిని గాంచెను. అప్పు డామె మనంబున శౌర్యాగ్ని ప్రజ్వలింపఁగా నామె పతివియోగదు:ఖమును మ్రింగి భర్తచేతివాలును, బలుకయుఁ దనకేల నమర్చి పతిసన్నిధిని నిలిచి తనసైనికులతో నిట్లనియె.