పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
161
సావిత్రీబాయి ఠాణేకరీణ్.

'ఓవీరవరులారా! స్త్రీలవలె నేల పాఱిపోయెదరు? మీరు మిగుల పరాక్రమవంతు లనియు, శత్రువులకు వెన్నియ్యని వారనియు మిగుల కీర్తిగాంచితిరి. ఆకీర్తికిదియేనా లక్షణము? మీ కధిపతియగు వాఁడిచటఁ బడియుండఁగా నతనిని శత్రువులస్వాధీనమున విడిచి చనుటయేనా శూరధర్మము ? మీతండ్రులు, తాతలు రాజభక్తులై తమప్రాణములను రాజుకొఱకు విడిచి స్వర్గమునకరిగి యుండఁగా మీరు రాజద్రోహులై నరకమునకుఁబోవ యత్నించుట యుచితమా? మీశత్రువులు మీయజమానునియొక్కయు, మీసహచరులయొక్కయు, మీబంధువులయొక్కయు మృతశరీరములకు నిర్దయులై గొడ్లనీడ్చు విధమున నీడ్చికోటక్రిందఁ బాఱవేయుదురో లేక అంత్యజులచేత వారిశరీరముల నొకపల్లములోఁ బాఱవేయింతురో, అట్లుగాక కుక్కలనక్కల కాహారముగానిచ్చి మిగిలిన యస్థిమాంసముల నరణ్యమునఁ బాఱవేయుదురో! ఇందుకైనను మీకు సిగ్గుకాదా? తిరుగుఁడు; మరలిరండు. మీచేత పరాక్రమమేమియుఁ గాకున్నను నాయొక్కయు, నాదాసీజనముయొక్కయుఁ బరాక్రమము చూచుచుండుఁడు! ఇట్టివాక్యముల నుచ్చరించి కేవలము మహిషాసురమర్దనుని యవతారమును బోలియున్న యా వీరయువతి తా నశ్వారోహణముచేసెను. వెంటనే యామె దాసీలును ఆయుధహస్తులై తమతమ గుఱ్ఱముల నెక్కిరి. దీనింగని పాఱిపోవు సైన్యములు సిగ్గుపడి మరలి సావిత్రిబాయి యాజ్ఞను మన్నించి యుద్ధముచేయుటకు సిద్ధమయ్యెను.

సావిత్రీబాయి తనసైనికుల నందఱినిఁ జేర్చి కోటను మరలఁగొన నిశ్చయించెను. ఈసంగతి దాదోజీకిఁ దెలియఁగా