పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతసించి విద్యాసాగరుడు 'మనయింటికొరకును బీదవారికొరకును మరియెన్నిబట్టలు కావలయునో వ్రాసినయెడల బంపెద' నని తల్లికి వ్రాసెను. తల్లి యెట్టిదో కుమారుడు నట్టివాడే యగును గదా?

విద్యాసాగరుని సహోదరుడగు దీనబంధు న్యాయరత్నమును మిగుల నుదారుడుగానే యుండెను. ఆయన వస్త్రహీనులను జూచినచో తన పైవస్త్రమునైనను వారి కిచ్చుచుండెను. పరుల దు:ఖమును గనిన నాతడా దు:ఖము తనకే కలిగినటుల విచారపడును. ఒక దినము దీనబంధుడు వీధిలో నొంటరిగానిలిచి యుండగా నొక బీదస్త్రీ చింపిరిబట్టను గట్టుకొని పోవుచుండెను. దాని గని దీనబంధుడు పైనున్న చిన్న వస్త్రమును, తాను కట్టు కొనిన కట్టుబట్టను దానికిచ్చివచ్చి తల్లికావృత్తాంతమునంతను చెప్పెను. అందు కామె మిగుల సంతసించి "నాయనా! నీవు బహు మంచిపని చేసితివి. నే నొకదినము రాత్రి నూలు వడికిన నీకు దోవతియగు" నని చెప్పెను. ఇట్టి బీదతనమునందును వారి యిల్లు అతిథి అభ్యాగతులకును, దు:ఖులకును సుఖప్రద మగు చుండెను. పిదప విద్యాసాగరుని బుద్ధికౌశలముచే లక్షాధీశులయినప్పు డెంత పరోపకారము చేసియుందురో చదువరులే గ్రహింపగలరు.

పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగరులవారు వితంతూ ద్వాహములను గురించి యత్నముచేయుట భగవతీదేవిగారి ప్రేరణచేతనే యని చెప్పెదరు. ఇందును గురించి జనానాపత్రిక యందిట్లు వ్రాయబడి యున్నది-