పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాగెను! అప్పు డామె శరీరమంతయు రక్తమయమైన సంగతి చూచి, ఆమె డస్సినదని తెలిసికొని, స్వామిభక్తిగల యొక సేవకుడు డామెను సమీపించి యిట్లనియె. "అమ్మా! మీరిక యుద్ధమును జేసినందువలన లాభమేమియు లేదు. కొద్దికాలములోనే శత్రువులు మిమ్ము చెరబెట్టగలరు. వారిచేతులలో బడక శీఘ్రముగా నిచ్చటనుండి పలాయనము చేయుట మేలు; తమకొక యిబ్బందిలేక నేను ఆవలకు దీసికొనిపోయెదను." ప్రియ సేవకుడు పలికిన యీ వచనములు విని, ఆమె చింతించి, శత్రువులు నిజముగా సమీపించుచున్నారని చూచి, పవిత్రమైన దేహము మ్లేచ్ఛులచే నపవిత్రమగునన్న మాటమాత్రము తలపునకు రాగా సహింపలేక, విషణ్ణవదనయై, తన సేవకుని జూచి యిట్లనియె. "ఓరీ! నీ వన్నమాట నిక్కము. ఇదిగో నా చేతనున్న ఖడ్గముం గొని, యిచ్చటనే నా శిరచ్ఛేదము చేయుము; నేను క్షత్రియకన్యను; కాన పగరకు వెన్నిచి చనుట నా కనుచితము. ఈ శరీరము శత్రులంటగూడదు, కాన నీ వన్యధా విచారము చేయక నా తల దునుముము. అందుచే నేను వీరస్వర్గమును బొందుదును. నా యాజ్ఞ విని నన్ను సంకటము నుండి కాపాడినందున నీకును బుణ్యమే గలుగును; పాపము గలుగ నేరదు." ఈ మాటను విన్నతోడనే ఆ స్వామిసేవాపరాయణుడయిన సేవకుడు నిశ్చేష్టితుడై, యేమియుదోచక నిలువబడెను. కొంతసేపట్లు నిలువబడి వాడిట్లనియె. "తల్లీ! నా విన్నపమాలకించి, ఈ యేనుగు నెక్కుడి. అది శీఘ్రముగా మిమ్మును శత్రువుల బారినుండి తప్పించి, యవతలకు గొనిపోవును, నేను స్త్రీ