పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశంసనీయము. ఇట్లనేకరీతుల బేగముగారు ఇంగ్లీషువారికి సహాయముచేసి అంతగ శాంతపడిన తరువాత నింగ్లీషువారి రాజ్యము స్థిరపడుటకును అనేక రీతుల సహాయము చేసెను. ఈ ప్రకారముగా నీమె ఇంగ్లీషువారిని కృతజ్ఞతా బద్ధులనుజేసినందువలన, వారీమెను చాల సన్మానించి, అదివరకు దీసికొనిన భైరసియాప్రాంత మామె కిచ్చివేసిరి. 1859 వ సంవత్సరమున నింగ్లీషువారు, శికందరుబేగము భూపాల సంస్థానమునకు స్వామినియనియు, మరణకాలమువరకీమెయే రాజ్యము చేయవలయుననియు, ఈమె మరణానంతర మామెకొమార్తెకు రాజ్యము దొరకుననియు నేర్పాటు చేసిరి. ఇట్లు బేగముగారి యిచ్ఛ సిద్ధించెను. ఇంగ్లీషువారు కృజ్ఞతాబుద్ధితో నామెకు నాలుగు తోపులు బహుమాన మొసంగిరి. వారు 1863 వ సంవత్సరమున గొప్ప దర్బారుచేసి బేగముగారికి 'స్టార్ ఆఫ్ ఇండీయా' అనగా 'హిందూదేశముయొక్క నక్షత్ర' మను బిరుదు నొసంగిరి. ఇట్లు బహువిధముల నింగ్లీషు ప్రభువు లీమెను సన్మానించిరి.

శికందరుబేగ మిట్లు రాజ్యకార్యదక్షతను గురించి కీర్తిని సంపాదించి, ఇంగ్లీషువారియెడ రాజనిష్ఠతనుజూపి, వారిచే ననేక సన్మానములను బడసి, ప్రజల ప్రీతికి పాత్రురాలయి యహికసుఖముల ననంతముగా ననుభవించుచుండెను.కాని సౌఖ్యములలో నామె పారమార్థికవిచారమును మరచినది కాదు. ఆమె బీదలయందధిక దయగలదయి వారి దు:ఖనివారణమున కనేకోపాయములను జేసెను. ఈమెస్త్రీలకు స్వాభా