పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులు కొన్ని రాళ్ళను పోగు చేసికొని యచ్చటనున్న యొక వృక్షమునెక్కి శత్రువులపయి రువ్వసాగిరి.

ఇంతలో నాగుర్రపురౌతులు వచ్చి, యాదంపతులను జుట్టుకొనిరి. వారెనిమిదిమంది యున్నందున వారితో బోరిగెలుచుట యసాధ్యమని తలచి, జగదేవుడు వారు తమపయికి రాకుండ ఖడ్గము తనచుట్తు త్రిప్పుకొనుమని తనభార్యకు సూచించి, తానును అదేప్రకారము చేసెను. వీరిలో వెనుక జగదేవుని పట్టుకొనిపోయినవారిలోనివాడొక డున్నందున, వీరందరును వాఘేలిరాణిగారిచే దమ్ము చంపుటకు నై పంపబడిన వారని వారు గ్రహించిరి. ఇట్లు కత్తి చుట్టుద్రిప్పుకొని యాత్మ సంరక్షణము చేసికొనుచున్న యా దంపతులపయి నాశత్రువు లనేక బాణములు గురిపించిరిగాని, యవియన్నియు వేగముతో ద్రిప్పబడుచున్న ఖడ్గముచే ఖండితము లయ్యెను. ఆ సమయమున వారిశరీరమును స్పర్శించుటకు వాయుదేవునికిగూడ శక్యముకాక పోయెను. ఇట్లు మహావేగముతో గత్తికొంతసేపు ద్రిప్పిడస్సి యిక నటుల చాలసేపు సేయుట యశక్యమని తలచి వీరమతి వారుచుట్టిన యావరణమును పగులదీసి యవతలకి బోవయత్నించెను; అటులనే సేయుటకయి పతికిని సూచించెను. వారిరువురు రెండుప్రక్కల నావరణమును బగులదీయుటయి యత్నింప జొచ్చిరి. వీరమతి యాశత్రువుల నాయకునిపయి నొక బాణము వేయగా నతడాబాణమునుదప్పించుకొనెనుగాని, యాబాణము దగిలి వానిగుర్రము కూలెను, ఆగుర్రము కూలగానే యతడును క్రిందబడి మూర్ఛిల్లెను. ఇట్లు వీరమతిచే