పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణములను రక్షింపుడి" యన్నధ్వనిని వినిరి. ఆ శబ్దమువచ్చెడి దిక్కునకు వారిరువురు తమగుర్రములను దిప్పి కొంతదూరము వెళ్లిరి. దూరమునుండి చూడగా బెద్దచెట్టుపై నిద్దరుమనుష్యులు కూర్చుండి గజగజ వణకుచుండుటయు, క్రిందనొక పెద్దపులి బొబ్బలుపెట్టుచు, నెగురుచు భయంకర మయిన రూపమును దాల్చి చెట్టుపైనున్న మనుష్యులను క్రిందబడవైచుటకు బ్రయత్నించుచుండుటయు గానవచ్చెను. ఇటుల జూచి వారిరువురు ఆ పులిని సమీపించి యొక పొదచాటునుండి దాని వీపునకు దగులునట్టుగా బాణము వెసిరి. అంతనాపులి వృక్షముమీది మనుష్యులను వదలి, వెనుకకు దిరిగి తనను నొప్పించిన దంపతులపయికి నురికెను. అంతలో జగదేవుడు మరియొక బాణమువేయగా నది తప్పిపోయెను. అందుచేత నాపులి, మరింత గర్జించుచు, జగదేవుని సమీపించెను. అప్పుడు వీరమతి తన చేతిబల్లె మాపులి పొట్టలో గ్రుచ్చగా, నది క్రిందబడి ప్రాణములు విడుచుచు బెద్దగా బొబ్బరించెను. ఆఘోర శబ్దమును విని, పొదలలోనున్న యాడుపులి యంతకంటె పెద్దగా నరచుచు తనప్రాణనాయకుని సహాయమునకు వచ్చెను. అప్పుడాశూరదంపతులు గూడి యాపులినిగూడా జంపిరిగాని దానిగోళ్ళచే గీరబడినందున జగదేవుని గుర్రమా బాధచే మృతి బొందెను. అందుకు జగదేవుడు మిక్కిలి చింతించి, తనదేహము పయి పచ్చడము దానిపై కప్పెను. చెట్టుపయిని యిద్దరుమనుష్యులు దిగివచ్చి, తమ ప్రాణదాతలకు నమస్కరించిరి. మీరెవ్వరని జగదేవుడు వారినడుగగా వారిట్లు చెప్పిరి. "ఉదయా