పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తల్లికిట్లు సమాధానము చెప్పెను. "అమ్మా! నీవేల శోకించెదవు? దు:ఖమెంత త్వరగా దగ్గిన నంత మంచిది. నేను క్షత్రియవీరుని బిడ్డనుగాన మరణమునకు వెఱవను. ఈ శరీరము పుట్టినప్పుడే చావు సిద్ధము. ఇక నా చావునకై వగచిన నేమి ఫలము." ఇట్టి వాక్యములచే దల్లికి సమాధానము చెప్పుచు నవ్వుచు నుండెనేకాని యాబాల యా విషముచే మృతిజెందదయ్యె. అంత రెండవభృత్యుడు మరియొకపాత్రలో విషము పోసికొనివచ్చి యామెచే త్రాగించెను. కాని యందు వలనను ఆమె మరణచిహ్నము కానరాదయ్యెను.

దాన నామె చావనందుకు సమరసమను నొక భయంకరమయిన విషమంపెను. దానిని త్రాగినవెంటనే యా కన్యారత్నముయొక్క పవిత్రచరితము ముగిసెను. కృష్ణకుమారి ధైర్యము, నిర్భయత్వము, సత్యశీలతయు, దేశముకొరకు దండ్రి కొరకు జూపిన యాత్మత్యాగమును మొదలగునవి యీ ప్రపంచమునందుండి యా నారిని నజరామరము చేయుచున్నవి.


_______