పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుపదేశమును విన, దేహమువలెనే యామె మనసుగూడ మిగుల కఠినమై వజ్రసమమై యుండెను. ఆ బాల శుక్లపక్ష చంద్రుని పగిది నభివృద్ధినొందిన కొలదిని తండ్రికి గలిగిన యవమానమున కెంతయు గుందుచు, నతని కట్టి యవమానము గలుగజేసినవాని జంపి పగ తీర్చుకొనుటకు సమయమునెదురు చూచుచుండెను. ఆమె విద్యయందును, శౌర్యమునందును నేప్రకార మసమానురాలో, రూపమునందును అటులే యనుపమేయమై యుండెను. తారాబాయి వివాహయోగ్య కాగా నామె సౌందర్యఖ్యాతి విని యామెను వరించుటకు రాజపుత్రులనేకులు వర్తమానము లంపసాగిరి. ప్రథమమునందు మేవాడ రాజపుత్రుడగు జయమల్లుడు తన కామె నిమ్మని కోరెను. కాని తండ్రి పగవాని నడపక వివాహ మాడనని తారాబాయి నిశ్చయించుకొనినందున నా రాజపుత్రునకు "ఎవడు నా జనకుని పగతుని జంపునో, వాడే నాభర్తయగుట కర్హుడు" అని యామె వర్తమాన మంపెను.

సూరథాన్‌రాయులు మేవాడ రాణాగారి మాండలికుడగుటచే నాతడు (మేవాడరాజు) తన కొమార్తె నడుగుట సన్మానప్రదముగనే సూరథానునకు తోచెను. కాని కూతురి ప్రతిజ్ఞ నెరవేర్చినయెడల నామె నతనికి నియ్యవలయునని అతనికి నుండెను. జయమల్లుడు శౌర్యహీనుడును, గర్విష్టుడు నైనందున పంత మీడేరుటకు బూర్వమే వివాహము కావలయునని కోరెను. కాని యందు కా పితాపుత్రిక లిరువురును సమ్మతింపకుండిరి. బలిష్టుడగు తురుష్కునిం బొడిచి గెలిచినంగాని