పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన కక్కన్యారత్నము దొరకదని తెలిసికొని యా రాజపుత్రు డాశారహితుడై యా వీరబాల నిట్లని నిందింప దొడగెను. "నీ తండ్రివలెనే నీవును దరిద్రలక్షణురాలవు. నేడు నావంటి గొప్ప రాజపుత్రుని దిరస్కరించితివి. కాన నీ యింటనుండు నొక హీనసేవకుని కంటె నన్యులు నిన్నెవరు వరింపజాలరని నమ్ముము." సూరథాన్‌రాయు లంతటి స్వాభిమాని కిట్టి నీచవాక్యములు విని యూరకుండ మనసెట్లొప్పును? తత్‌క్షణమే యాతడు చేతి ఖడ్గముతో నా రాజపుత్రుని జంపెను. ఈ వర్తమాన మాతని తండ్రియగు రాయమల్లునకు దెలియగా నాతడెంతమాత్రమును చింతింపక "మా నిర్మలమై వంశమును జెరపనున్న యా దుష్టునికి దగిన శిక్ష గలిగె"నని నుడివెను. అట్లు దుష్టుని శిక్షించినందునకై సూరథాన్‌రాయులను మిగుల బొగడెను.

రాయమల్లునకు పృథివీరాజను మరియొక కుమారుడుండెను. తండ్రి యా పుత్రుని నేలనో ద్వేషించి పూర్వము విడనాడెను. కాని పెద్దకుమారుడీ ప్రకార మడుగంటిన పిదప పృథివీరాజును రప్పించి యువరాజును గావించెను. పృథివీరాజు మిగుల సద్గుణవంతుడును న్యాయప్రియుడును నైనందువలన ప్రజలాతని రాకకు మిగుల సంతసించిరి. పృథివీరాజు రాజ్యపదవి నొందిన పిదప తారాబాయి సద్గుణములును రూపలావణ్యాదులును విని తన శౌర్యము గనపరచి యామెను వివాహమాడ నిశ్చయించి సూరథాన్ రాయుల శత్రునిపై దండెత్తిపోవ నిశ్చయించెను. ఆవార్త విని తారాబాయి