పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూచి లోకులీ వార్త పుట్టించి రనుటకు సందేహము లేదు. ఆమెకు గణితము చెప్పు నెడ వేసిన ప్రశ్నలును, వాని యుత్తరములును నొకటిగా జేసి భాస్కరాచార్యులు లీలావతి గణిత మనుపేర బ్రసిద్ధిజేసెనని యందురు. ఈ సంగతి లీలావతి గణితములోని "బాలే బాలకురంగలోలనయనే లీలావతీ ప్రోచ్యతాం" "అయే బాలే లీలావతి మతి మతిబ్రూహి" (లీలావతి యను బాల యీ లెక్కను చెప్పుము అని అర్థము.) అనిన వాక్యమువలన నీ సంగతి నిజమేయయి యుండవచ్చునని తోచుచున్నది. లీలావతి గణితము వలననే, బాలవితంతువయిన లీలావతియొక్క కీర్తి సకల దేశములయందును నిండియున్నది. లీలావతిగణితము ఫారసీ, ఇంగ్లీషు మొదలయిన పరభాషల యందుగూడ భాషాంతరీకరింపబడినది. లీలావతి గణితములోని లెక్కలన్నియు జేయుటకు బురుషులకే మహా ప్రయాసముగా నుండును. కాన నిట్టి కఠినపు లెక్కలను నేర్చిన స్త్రీయొక్క బుద్ధికుశలత యెంత యుండవలయునో చదువరులే యూహింప గలరు.

ఈ లీలావతిచరితమువలన బూర్వకాలమున ఈ దేశము నందు స్త్రీవిద్య సర్వసాధారణమయి యుండెనని తెలియు చున్నది.


_______