పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుడయి ముహూర్తము నెదురుచూచుచుండెను. అంత గొంత సేపటికి లీలావతి యా గిన్నెలోనికి నీరువచ్చు విధము చూడగోరి కొంచెముజరిగి చూచుచుండెను. అట్లు చూచునపు డామె శిరోభూషణము నందుండిన యొక సన్ననిముత్య మా గిన్నెలోబడి నీరువచ్చుమార్గము నరికట్టెను. ముత్యము పడిన సంగతి యెవరును చూచినవారు. కారు. ఎంతసేపు చూచినను గిన్నె మునుగకుండుట గని, దాని కారణము నెరిగి ఆచార్యులవారు హతాశులై యేదో యొక ముహూర్తమునందు లీలావతి వివాహము గావించిరి.

వివాహానంతరము స్వల్పకాలములోనే లీలావతికి వైధవ్యము ప్రాప్తించెను. కూతున కిట్టి దురవస్థ సంభవించినందున దండ్రి మిగుల బరితపించెను. కాని యాయన యంతటితో దనకొమార్తెజన్మము నిరర్థకమని తలపడయ్యెను. లీలావతికి సంసార సౌఖ్యము లేక పోయినను ఆచార్యుల వా రామెకు విద్యానంద మొసంగ దలచిరి. లీలావతి యదివరకే విద్యావతి యగుట వలన నామెకు దండ్రి గణితశాస్త్రమును నేర్పసాగెను. లీలావతియు విద్యాభిరుచిగలదై, తన దు:ఖమును మరచి సదా గణితాభ్యాసమే చేయుచుండెను. కొన్నిరోజుల కామెకు గణిత శాస్త్రమునం దపార పాండిత్యము గలిగెను. ఈమె తన గణిత ప్రావీణ్యముచేత గణించి, యరగంటలో వృక్షమునకు గల యాకులసంఖ్య చెప్పుచుండెనని యొక లోకవార్తగలదు. ఈ లోకవార్త యెంతమాత్రమును నమ్మదగినది గాకపోయినను, లీలావతికి గణితశాస్త్రమునందుగల యసామాన్యప్రజ్ఞను