పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తారాబాయి

క. విదలింప నురుకు సింగపు
   గొదమయు మదమలినగండ కుంజరములపై;
   నిది బలశాలికి నైజము
   గద, తేజోనిధికి వయసు కారణమగునే?

ఈమె క్షత్రియ వంశమునం దుద్భవించి, తన యందలి యనేక సద్గుణములకు దోడు శౌర్యమును సహితము ధరియించి మిక్కిలి వన్నె కెక్కెను. ఈమెకాలము గనుగొనుటకు బ్రస్తుత మేమియు సాధనము లగుపడనందున విధిలేక యా ప్రయత్నమును మాని, యామె పవిత్రచరిత్ర మిందుదాహరించెదను.

పూర్వము మ్లేచ్ఛరాజుల కాలమునందు మన దేశము నందలి సంస్థానికులును, రాజులును మిగుల కష్టదశ యందుండిరి. తురకలు చేయు నన్యాయమున కోర్వజాలక ప్రజలును మిగుల హీనస్థితియందు బాధ పడుచుండిరి. అట్టి సమయము నందు రాజపుతానాలో వేదనగరమను చిన్న సంస్థానమొకటి యుండెను. సూరనాథాన్‌రావను నాయన అచటి ప్రభువుగా నుండెను. ఈయన పూర్వము మహాబల శౌర్యములు కలిగి శత్రువుల నోడించినవాడయినను పిదప మిగుల వృద్ధుడగుటవలన వైరివీరుల నెదుర్చుటకు శక్తుడుగాకుండెను. ఇట్లుండ దిల్లాయను తురుష్కు డొక డాయనపై దండెత్తివచ్చెను. ఆ మ్లేచ్ఛునితోడ బోరుటకు శక్తిలేక యా రాజు రాజ్యమును వానికి విడిచి తన ముద్దుల కూతురగు తారాబాయిని దోడ్కొని తక్షశిలా లేక