పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుండక లక్ష్మీబాయి సీమలో నపీలు చేయదలచి ఉమేశ చంద్ర బానర్జీ యను వంగదేశీయునిని, మరియొక ఆంగ్లేయ ప్లీడరును ఆరులక్షలరూపాయలిచ్చి యింగ్లండునకు బంపెను. కాని వారచటి కరిగి యేమి చేసినదియు నెచట నున్నదియు నేటివరకును దెలియదు, వారచట ననేకోపాయముల జేసెదరనియు వారి ప్రయత్నమువలన దనకు రాజ్యము మరల ప్రాప్తించుననియు రాణిగారికి మిగుల నమ్మక ముండెను.

1855 వ సంవత్సరమున దామోదరరావుగారికి నుపనయనము చేయదలచి ఆ పిల్లనిపేర దొరతనమువారు దాచియుంచిన 6 లక్షల రూపాయలలోనుండి యొక లక్షరూపాయ లిండని రాణిగారు దొరతనమువారిని నడిగిరి. అందుకు వారు నీవు దీనికొర కెవరికైన జామీనుంచినంగాని యియ్యమనగా నదేప్రకారము వారు కోరినవారి జామీనిచ్చి లక్షరూపాయలు తీసుకొని, యా సంవత్సర మాఘమాసమునందు మహావైభవముతో గుమారుని యుపనయనము చేసెను. తన భర్తసొత్తు పుత్రుని యుపనయనమునకు దీసికొనుటకుగాను పరుల జామీను కావలసినందుకు రాణిగారి మనస్సెంత ఖేదపడి యుండెనో చదువరులే యోచింపగలరు.

ఇట్లు రాణిగా రత్యంతదు:ఖముతో గాలము గడుపుచుండగా 1857 వ సంవత్సరమున హిందూపటాలము ఇంగ్లీషువారిపై దిరుగబడిన విప్లవకాలము ప్రాప్తించెను. ఈ యుద్ధ మితిహాససిద్ధమేగాన నితిహాసజ్ఞుల కందరకు విదితమే.