పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పటాలములు తిరుగబడిన యీ వర్తమానము ఝాశీలోని హిందూపటాలములకు దెలిసి యదివర కడగియున్న ద్వేషాగ్ని ప్రజ్వలింప జూన్ నెల 1 వ తేదిని వారును స్వాతంత్ర్యసమరమునకు బ్రారంభించిరి. వారి సేనానాయకుడు వారిని నివారింప నెంత యత్నించినను వారు తిరుగకుండిరి. అదిగని యతడు గ్రామమునందలి యాంగ్లేయుల నందరను మిగుల భద్రమగు కిల్లాలోని కరుగుడని గుప్తరీతిని దెలుపగా వారా ప్రకార మచటి కరిగి కోటద్వారముల మూసికొనిరి. కాని మరుసటిదినముననే యా తిరుగబడిన పటాలములవారు సేనలో మొనగాని జంపి యుప్పొంగి కిల్లాను చుట్టుముట్టి బహు ప్రయత్నముల నచటివారి నీవలకుదీసి వారినందరి నేకక్షణముననే యమసదనమున కనిచిరి. వారట్లాయూర నొక యాంగ్లేయ శిశువు సహితము లేకుండజేసి ఝాశీరాజ్యము మహారాణీలక్ష్మీబాయిగారిదని ధ్వజమెత్తిరి. అప్పటినుండి రాణిగారు పటాలములతో గలిసి స్వతంత్రించి ఝాశీ సంస్థానమున తన రాజ్యమును స్థాపించ యత్నించ దొడగెను. ఆ నాలుగురోజులనైన రాణిగారు రాజ్యవ్యవస్థ మిగుల నిపుణతతో జేసిరి. ఆమె తన నేర్పువలన నేయే పనుల కెవ్వరెవ్వరు యోగ్యులో యాయా పనులకు వారివారిని నియమించెను. కాని పూర్వపు ఉద్యోగస్థులను దొరతనమువా రిదివఱకే తీసివేసినందున రాణిగారికి దగిన యుద్యోగస్థు లా సమయమున దొరకకుండిరి. అయినను ఆమె తనవలన నగునంతవరకును సిద్థపఱచి దుర్గసంరక్షణనిమిత్తము క్రొత్తసైన్యమును సిద్ధపరచెను.