పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశమునం దంతటను సువిఖ్యాతమే. ఈ రామాయణములోని కొంతభాగము ప్రవేశపరీక్షకు బఠనీయ గ్రంథముగా నప్పుడప్పుడు నియమింపబడియున్నది. ఇందువలన నీ రామాయణ మొక శ్రేష్ఠమైనకావ్యమని స్పష్టమగుచున్నది. ఈమె కవనధోరణి దెలుపుటకయి మొల్ల రామాయణమునందలి కొన్ని పద్యముల నిందుదాహరించెదను.

ఉ. రాజులు కాంతియందు రతిరాజులు రూపమునందు వాహినీ
   రాజులు దానమందు మృగరాజులు విక్రమ కేళియందు గో
   రాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రా
   రాజులు మానమందు నగరంబున రాజకుమారు లందరున్.

ఉ. సాలముపొంత నిల్చి రఘు సత్తము డమ్మరివోసి శబ్దవి
   న్మూలము గాంగ విల్ దివిచి ముష్టియు దృష్టియు గూర్పి గోత్రభృ
   త్కూలము వజ్రపాతహతి గూలువిధంబున గూల నేసె న
   వ్వాలి బ్రతాపశాలి మృడువందనశీలి సురాలి మెచ్చంగన్.

ఉ. పున్నమచందరుం దెగడి పొల్పెసలారెడు మోముదమ్మియున్
   గన్నులు కల్వరేకులను గాంతి జయించకుం గాని రక్తిమన్
   జెన్ను దొలంగి యుండ వరచేతులు బాదములున్ దలంపం గా
   నున్నవి వర్ణముల్ గలిగి యెప్పు తొరంగదు రాఘవేశ్వరా.

ఈ మొల్ల కుమ్మరకులమునం దుద్భవించియు దన విద్య వలన నుచ్చవర్ణమువారిచే గూడ గౌరవింపబడ బాత్రురాలాయెను. ఇట్టివిద్య మా సోదరీమణుల కందరకును గలిగిన యెడల మనదేశ మితరదేశము లన్నిటికిని మాన్యస్థాన మగుననుట కెంతమాత్రమును సందియము లేదు.


________