పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమారా! నీ వవలంబించిన మార్గమును విడువక పూనిన యీ మహాకార్యమును నిర్వహింపుము. నీ కెన్నికష్టములు వచ్చినను మేమెప్పుడును నిన్ను విడువక నీకు సహాయులమై యుండెదము. ఒకవేళ మేము నిన్ను విడిచిపెట్టినను నీవు నిరుత్సాహుడవు గాకుమా" యని యాతనికి బోధించుచు శ్రీభగవతీదేవి బాలవితంతువులపాలిటికి సత్యమయిన రక్షకురాలయి నిలిచెను.

పునర్వివాహము చేసికొనిన వధూవరులను ఆ కాలమునందు వారియాప్తులు తిరస్కారముగ జూచి, మిగుల బాధపెట్టు చుండిరి. ఆ యువతులను దనయొద్దకి బిలిచి భగవతీదేవి వారికి ననేక బుద్ధుల గరపి, బుజ్జగించి వారిని దనపొత్తున గూర్చుండబెట్టుకొని, భోజనముచేసి యాప్తుల తిరస్కారమువలన ఖిన్నులైన వారిని సంతోషపెట్టుచుండెను. ఇంటికి వచ్చిన అతిథిని తాను సన్మానించి పంపనిదినము భగవతీదేవికి మిగుల దు:ఖదినముగా నుండెను. తన శరీర మస్వస్థముగా నున్నను అతిథి కన్నము పెట్టించిగాని, యామె నిద్రించుచున్నది కాదు.

సివిలియన్ హరిసన్ దొరగారొకదినము వీరియింటికి విందారగింప వచ్చెను. అప్పుడు భగవతీదేవి తానే పాకముచేసి వడ్డించెను. భోజానానంతరము వారందరు మాటలాడుచుండ నాదొర భగవతీదేవిని జూచి 'మీయొద్ద చాల ధనమున్నదా' యని యడిగెను. అందుకామె కార్నేలియావలె తనకొమారుల జూపి వీరే నాధనమని చెప్పెను. ఆమెనుగని యాదొర విద్యాసాగరునితో 'నీ సాధ్వివలననే నీవింత సద్గుణవంతుడవయితివ'ని పలికెను. భగవతీదేవియొక్క సుగుణసంపదలగని యామె