పుట:Abaddhala veta revised.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లైంగికంగా చిన్న పిల్లలు వివిధ చిత్రహింసలకు గురైనప్పుడు వారిని ఎలా జాగ్రత్తగా చూడవలసిందీ పరిశోధన జరుగుతున్నది.

మనదేశంలో యీ విషయమై కప్పిపుచ్చడం చాలా ఎక్కువ. సమాజంలో యీ దురాచారాన్ని అరికట్టకపోతే పిల్లల భవిష్యత్తు బాగా దెబ్బతింటుంది. మనకు చాలా కాలంగా, గురుకులాలలో వున్న సెక్స్ దురాచారాలు, వివిధ రూపాలలో పొంచివుంది. దీనిని కూడా ఎదుర్కోవాలి.

పిల్లల హక్కుల విషయం 21వ శతాబ్దిలో అత్యంత ప్రాధాన్యత వహించేదిగా పరిణమించనున్నది. తల్లిదండ్రులకు యిది షాక్ ట్రీట్ మెంట్. మతాలకు పునాదులు కదిల్చే పరిస్థితి.

-మిసిమి మాసపత్రిక, ఆగస్టు-1999
చిన్నపిల్లలకు ఎలా చెప్పాలి?

పిల్లలకు చక్కగా విషయాలు చెప్పడం అంత సులభమేమి కాదు. అందుకు కృషి అవసరం. ఉపాధ్యాయులకు శిక్షణ ముఖ్యం.

మూఢ నమ్మకాలు చెప్పడం సులభం. ఆలోచించనక్కరలేదు. తర్కం, పరిశీలన, పరిశోధన అన్నీ శ్రమతో కూడిన పని. పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అటు తల్లిదండ్రులు, యిటు పెద్దలు, ఉపాధ్యాయులు అదిరించి బెదిరించి ఏవో చెప్పేస్తుంటారు. అందులో అబద్ధాలు, అసత్యాలు, అసంబద్ధాలు, అశాస్త్రీయాలు పుష్కలంగా వుంటాయి. అన్నింటికీ మించి గుడ్డి నమ్మకాలుంటాయి.

అవే పిల్లలకు హాని. పెద్దయినా చెరగని ముద్రవేస్తున్న యీ మూఢ నమ్మకాలకు భిన్నంగా పిల్లలకు చెప్పే పద్ధతుల కోసం మానవవాదులు, హేతువాదులు, నాస్తిక సంఘాలు కృషి చేస్తున్నాయి. తదనుగుణంగా పుస్తకాలు రాస్తున్నారు. ఇటీవల అమెరికాలో అలాంటి పుస్తకం వెలువడింది. పుస్తకం పేరు (Just Pretend - A Freethought Book for Children) డాన్ బార్కర్ దీని రచయిత. 72 పేజీల గ్రంథం ఆకర్షణీయ కార్టూను చిత్రాలతో అత్యంత అధునాతన శాస్త్రీయ దృక్పథంలో వుంది.

భారతదేశంలో దీనిని అనుసరించి ఉత్తమ రచనలు రూపొందించవచ్చు. ఆ పుస్తకం ఎలా సాగింది?

ఇద్ద్దరు పిల్లలు మాట్లాడుకుంటారు. ప్రపంచంలో నీకు సరిగా పోలిన వారెవరూ లేరు అని ఒకరంటారు. (చేతిలో అద్దం వుంటుంది) నీవు ఒక ఆలోచనగల వ్యక్తివి. నీకు మెదడు వున్నది. అది ప్రత్యేకమైంది. మంచిచెడ్డలను నిజానిజాలను మెదడు చూపుతుంది.