పుట:Abaddhala veta revised.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందులో కనీసం 24 లక్షల మంది పిల్లల్ని రోగాలనుండి కాపాడడం సాధ్యమైనా, అశ్రద్ధ, అనాగరికత, అజ్ఞానం, అందుబాటులో వైద్యం లేక హతమౌతున్నారు. 40 లక్షల మంది పిల్లలకు శుభ్రమైన నీరు తాగే అవకాశం లేకుండా వెనుకబడిన దేశాలలో పెరుగుతున్నారు. ఆసియా దేశాలలో ఆరున్నర లక్షల మంది పిల్లలు వ్యభిచార వృత్తిలో వున్నట్లు అధికార లెక్కలు చూపుతున్నాయంటే, యీ సమస్య యింకెంత తీవ్రంగా వుందో గ్రహించవచ్చు. పెద్ద వాళ్ళ ఎయిడ్స్ వ్యాధులవలన, సెక్స్ అశ్రద్ధవలన చిన్న పిల్లలకు అవి సోకి హతమారుతున్నారు. 20 లక్షల మంది ఆడపిల్లల్ని సాలీనా "సుంతీ" ఘోరకృత్యానికి గురిచేస్తున్నారు. గత దశాబ్దంలో వివిధ యుద్ధాలలో చిన్నపిల్లల్ని వినియోగించి 20 లక్షల మందిని హతమార్చారు. 50 లక్షల మంది వికలాంగులుగా మారారు. కోటి మంది నిరాశ్రయులయ్యారు. మందుపాతర్ల వలన నిరంతరం పిల్లలు దారుణంగా బాధలకు, చావులకు గురౌతున్నారు.

ఈ విషయాలన్నీ ప్రపంచమతాల సభలు గుర్తించాయి. వీటిని అరికడతామని అంటున్నాయి. 1990లో ప్రిన్స్ టన్ (అమెరికాలో) ప్రపంచ మత ప్రతినిధులు సమావేశమై పిల్లల హక్కుల్ని వెంటనే గుర్తించి అమలుపరచాలన్నారు. 1996లో మళ్ళీ యీ మత సంస్థలు తీర్మానాలు చేశాయి. 1993లో చికాగో నగరంలో 5 వేల మంది మాట ప్రతినిధులు సమావేశమై చిన్నపిల్లల సంరక్షణ తక్షణ అవసరంగా పేర్కొన్నారు. దొంగ స్వయంగా ముందుకొచ్చి, "దొంగ దొంగ" అని అరచి, తప్పించుకున్నట్లుగా, మతాలు ముందుకొచ్చి, చిన్నపిల్లల హక్కుల గురించి మొసలికన్నీరు కారుస్తున్నాయి. మతాలు చేస్తున్న ఘోరకృత్యాలు, మత గ్రంధాలలో పిల్లలకు వ్యతిరేకంగా వున్న దారుణాలు, మతాల పేరిట జరుగుతున్న చిన్న పిల్లల అత్యాచారాలు ఖండించలేకపోతున్నారు.

మానవ హక్కులు కావాలని పోప్ అనడం ఎంత అపహాస్యమో, పిల్లల హక్కుల్ని గురించి మతాలూ మాట్లాడడం అంతే.

పిల్లల హక్కుల గురించి బాగా ప్రచారం జరగాలి. ఇది మతేతరంగా సాగడం అవసరం.

యునిసెఫ్ సంస్థ పిల్లల హక్కుల కోసం చేస్తున్న కృషిని స్వచ్ఛంద సంస్థలు చేపట్టవచ్చు. టి.వి., రేడియో, పత్రికలు, మానవ హక్కుల సంఘాలు ప్రధాన పాత్ర వహించవచ్చు.

ప్రాధమిక పాఠశాల స్థాయి నుండీ పిల్లల హక్కుల గురించిన వివరాలు ఆకర్షణీయంగా రాసి పాఠాలుగా అందించాలి. ఉపాధ్యాయులు యీ హక్కుల పత్రాన్ని బాగా అధ్యయనం చేయాలి. టి.వి.లో చక్కని ప్రదర్శనలు డాక్యుమెంటరీల ద్వారా విపరీత ప్రసారాలు రావాలి.

మానవహక్కులలో భాగంగా పిల్లల హక్కులకు ప్రాధాన్యత వుందని గుర్తించాలి.

పిల్లలకు చెప్పవలసిన విషయాలలో సున్నితమైన పుట్టుక, పెరుగుదల గురించి ప్రామిథిస్ ప్రచురణ సంస్థ అమెరికాలో శాస్త్రీయ రచనలు వెలువరించింది.