పుట:Abaddhala veta revised.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నీవు చదివే పుస్తకం వెనుక కోటి రూపాయలున్నాయంటే, నమ్ముతావా? (ఒకబ్బాయి అడుగుతాడు) రెండో అబ్బాయి పుస్తకం వెనక్కు తిప్పిచూస్తాడు. కోటి రూపాయలు లేవు. కనుక నమ్మను. అంటాడు.

అయితే కథలలో, పురాణాలలో, గీతలో, వేదాలలో, ఇతిహాసాలలో ఇలాంటి నమ్మశక్యంగానివి ఎన్నో వింటుంటాం. అప్పుడేం చేయాలి?

అవన్నీ కథలుగా ఆనందించాలి. మరచిపోవాలి. నిజం అని నమ్మరాదు. పుస్తకం వెనుక కోటిరూపాయలుండడం ఎంత కట్టుకథో, మిగిలిన గాథలు అంతే. కథలలో విషయాలు నిజం అని నమ్మితే అది గుడ్డి నమ్మకం అవుతుంది.

ఎందరో దేవుళ్ళు,దేవతలు, పిశాచాలు కథల్లో వస్తాయి. అవన్నీ కథలు రాసినవారు ఊహించనివే. నిజంగా వున్నాయని నమ్మరాదు.

శంకరుడు ఏటా ఏదోక జంతువుపై వస్తాడంటారు. అదీ వూహే. క్రైస్తవులు శాంతాక్లాజ్ మిధ్యను నమ్మినట్లు! పిల్లల్ని భయపెట్టడానికి పెద్దలు కొన్ని కథలు అల్లుతారు. వినాయకుడికి దండం పెట్టకపోతే చదువురాదు అనేది అలాంటి నమ్మకాలలో ఒకటి. దేవుడి విగ్రహానికి కాలు తగిలితే కళ్ళుపోతాయంటారు. అదీ కథే.

ఎలా పుట్టాను నేను అని పిల్లలు అడిగితే, దేవుడు పుట్టించాడని చెప్పడం అబద్ధం. పిల్లలకు యింతకంటే అన్యాయం చేయడం మరొకటి లేదు. ఇప్పుడు అనేక దేశాలలో శాస్త్రీయంగా ఆకర్షణీయంగా సులభంగా చెబుతున్నారు. అమెరికాలో ప్రామిథిస్ ప్రచురణకర్తలు యీ విషయమై చక్కని పుస్తకం ప్రచురించారు. పిల్లలకు దాచిపెట్టడంలో వుండే యిబ్బంది కన్నా, విప్పి చెప్పడంలో ఉపయోగం ఎక్కువ.

చాలామంది దేవుణ్ణి నమ్ముతారు. తినేముందు పడుకోబోయే ముందు పరీక్షలు ముందు దేవుడికి దండం పెట్టుకోమని పిల్లలకు చెబుతారు. దేవుడు అంటే ఏమిటో తెలియకుండానే పిల్లలు ఆ పని చేస్తుంటారు. అదొక అలవాటుగా మారిపోతుంది.

అడిగిన వరాలన్నీ దేవుడు యిస్తాడని పిల్లలకు చెబుతారు. దేవుడి గురించి చిన్నప్పటి నుండీ రకరకాలుగా యిలా తల్లిదండ్రులు నూరిపోయడం వలన చాలా హాని జరుగుతున్నది. ముఖ్యంగా పిల్లల్లో అడిగితెలుసుకునే జిజ్ఞాస చచ్చిపోతుంది. ప్రశ్నిస్తే తప్పు అని దేవుడి విషయంలొ భయం కల్పిస్తున్నారు. పిల్లలకు దేవుడి విషయం చెప్పాలి. కాని నిజం చెప్పాలి.

దేవుళ్ళు అనేకం అనేక చోట్ల వున్నారని చెప్పాలి. ప్రాచీనకాలం నుండి నేటివరకు దేవుళ్ళు పుడుతూనే వున్నారని చెప్పాలి. ముస్లింలు అల్లాను, క్రైస్తవులు జీసస్ ను, బౌద్ధులు బుద్ధుడిని, ఇలా అనేక మతాలు తమ దేవుళ్ళను సృష్టించుకున్నాయని చెప్పాలి. వీటికి భిన్నంగా భారతదేశంలో లక్షల సంఖ్యలో హిందూ దేవుళ్ళు దేవతలు వున్నారు. ఇందులొ స్త్రీలు,