పుట:Abaddhala veta revised.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్ని మంత్రతంత్రాలు, మహత్తులు ప్రేమానంద్ చేసి చూపగా, ఆమెకు మబ్బు విడిపోయి, యథాస్థితికి వచ్చింది.

మట్టితెచ్చి, పొట్లంలో చుట్టి నోటిదగ్గరగా తీసుకెళ్ళి ప్రేమానంద్, ఏవో మంత్రాలు చదివాడు. అలా మంత్రాలు చదువుతూనే మట్టి పొట్లాన్ని చేతివేళ్ళమధ్యదాచి, అంతకుముందా వేళ్ళమధ్యదాచిన పసుపు పొట్లం అరచేతిలోకి తెచ్చాడు. చుట్టూ గుమిగూడినవారు మట్టికాస్తా పసుపుగా మారడంపట్ల ఆశ్చర్యపోతుండగా ప్రేమానంద్ తన జేబులో చేయి పెట్టి అంతకుముందే పెట్టిన నిమ్మబద్దను చూపుడువేలితో రాశాడు. తరువాత చూపుడువేలును పసుపుతో రాస్తాడు. అది కాస్తా ఎర్రకుంకుమ రంగులోకి మారుతుంది. మట్టి ముందుగా పసుపుగా మారి తరువాత కుంకుమగా ఎలా మారిందీ ప్రేమానంద్ వివరించేసరికి, భక్తులకు మాయ కాస్తా పొర తొలగినట్లు తొలగింది.

టెంకాయ భక్తి

భక్తికీ కొబ్బరికాయలకూ చిరకాలంగా సన్నిహిత సంబంధం వుంది. కొబ్బరిబొండాలతో, టెంకాయలతో చిత్రవిచిత్ర చర్యలుచూపి భక్తులను ఆకట్టుకోవడం, భయపెట్టడం కూడా చూస్తున్నాం. కేరళలో యిది మరీ ఎక్కువ.

కొబ్బరికాయలు తలకు వేసి కొట్టుకొని అది భక్తిగా కొందరు ప్రదర్శిస్తారు. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు రెండు సమాన భాగాలైతే మంచిదనీ, ఒకే దెబ్బతో పగిలితే శుభమనీ, అలాంటి నమ్మకాలెన్నో వున్నాయి. కొబ్బరికాయ పగులగొట్టినప్పుడు లోన పుష్పాలు, రంగునీళ్ళు, ఎరుపు కనిపిస్తే దానిపై వ్యాపారం చేసి, చిత్రవిచిత్ర వ్యాఖ్యానాలు చేసే గ్రామ వైద్యులున్నారు, భూతవైద్యులున్నారు. ఇలాంటి కొమ్మరికాయ మహత్తులను హేతువాదులు, ప్రేమానంద్ ఆధ్వర్యాన ఎన్నో పర్యాయాలు బట్టబయలు చేశారు. అందులో కొన్ని చూద్దాం. లేత కొబ్బరికాయలు మూడు కన్నులచోట తలకేసి కొడితే వూరికే పగులుతాయి. అలాంటివి కేరళలో, శ్రీలంకలో 101 తలకు కొట్టుకొని అదే మహత్తుగా చూపిన బాబాలున్నారు. అలాంటి కొబ్బరికాయలలో ముదురుకాయల్ని హేతువాదులు చాటుమాటుగా పెట్టినప్పుడు బాబాలకు నొసట రక్తం కారింది. కాని, కొబ్బరికాయ పగలలేదు!

గట్టి టెంకాయ పగులగొట్టాలంటే తలకు దెబ్బ తగులుతుంది. కొబ్బరిపీచు తీసేసి కత్తితో మెల్లగా కొట్టి, చిట్లే వరకూ చూడాలి. తరువాత మూడు రోజులు ఎండబెట్టి,చిట్లినచోట కుంకుమ గంధంరాసి, మంత్రాలు చదువుతూ,భక్తుల ఎదుట, తలకు, కొట్టుకుంటే వూరికే పగులుతుంది. చిట్లిన విషయం వారికి తెలియదుగదా.

కొబ్బరికాయ పీచు తీసేసి నిమ్మరసం వున్న పాత్రలో పెట్టి తరువాత మూత తీయాలి. అప్పుడు కొబ్బరికాయపై మంత్రాలు చదువుతూ నీళ్ళు చల్లితే, పగులుతుంది.