పుట:Abaddhala veta revised.pdf/66

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కొబ్బరికాయ పీచుతీసి, కన్నులవద్ద పట్టుకోడానికి వీలుగా పీచు అట్టిపెట్టాలి. ఇంజక్షన్ తో నీళ్ళు కలిపిన పొటాషియం పర్మాంగనేటు ద్రావణాన్ని మెత్తని కన్ను ద్వారా పంపాలి. తరువాత మైనం పెట్టాలి. పట్టుకొనే పీచులో సోడియం మెటల్ ముక్క పెట్టాలి. భక్తుణ్ణి పట్టుకోమని, మంత్రాలు చదువుతూ, కొబ్బరికాయపై నీళ్ళు చల్లాలి. హఠాత్తుగా నిప్పు రగులుతుంది. కొబ్బరికాయ పగిలి, ఎర్రని రక్తం వంటి ద్రవం కారుతుంది. నీటితో కలిసిన సోడియం రసాయనిక మార్పు అది. మహత్తుగా దీనిచుట్టూ ఎన్నో కథలు అల్లవచ్చు.

బాబా దర్శనం

షిర్డి సాయిబాబా భక్తి యిటీవల ఎక్కువగా ప్రవహిస్తున్నది. "నేను షిర్డీసాయి అవతారమని" సత్యసాయి లోగడ చెప్పాడు. చెన్నారెడ్డి మొదలు ఎన్.టి. రామారావు వరకూ షిర్డిసాయి భక్తులే. రాజకీయవాదులు కొత్తగా భక్తి పెంచుకుంటే, మూలపురుషుణ్ణి కూడా సందేహించాలి.

షిర్డీసాయి గురించి సినిమాలు వచ్చాయి. చిత్రవిచిత్ర కథలు ప్రచారంలో వున్నాయి. భక్తులు కొందరు ఆయన ఫోటో,చిత్రపటం తమ ఇళ్ళలో కనిపిస్తున్నట్లు చూపుతున్నారు. ఇదెలా సాధ్యం?

గ్లాస్ ప్లేటు శుభ్రంగా కడిగి, ఆరబెట్టాలి. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం(యాసిడ్)లో ముంచిన స్టీల్ పెన్ తో షిర్డిసాయి బొమ్మ వేయండి. 10 నిమిషాల తరువాత మంచినీటితో కడగండి. గ్లాస్ ఎండబెట్టి లేదా ఆరబెట్టి వస్త్రంతో తుడిస్తే ఏమీ కనిపించదు. గ్లాస్ పై గాలి వదలండి. షిర్డిసాయి బొమ్మ వస్తుంది. గాలిలో తేమ ఆరగానే బొమ్మ అదృశ్యమవుతుంది. దేనిపై భక్తుల్ని ఎంతైనా మోసగించవచ్చు.

మీరు సత్యసాయి భక్తులైతే ఇంకో విచిత్రం చేసి మహత్తుగా చలామణి చేయవచ్చు. ఫోటోపేపర్ పై సత్యసాయి బొమ్మవేసి, మంచినీటితో కడగండి. మెర్క్యురిక్ క్లోరైడ్ ద్రావణంలో ఫోటోపేపరు వుంచి, బయటకు తీసి ఆరబెట్టండి.

భక్తుల్ని కూడగట్టండి. సత్యసాయి నిజమైన భక్తులకు కనిపిస్తాడని కథలు అల్లండి. ప్రార్థనలు చేయించండి. హైపో సొల్యూషన్ లో ఫోటో పేపరు వుంచితే, సత్యసాయి ఫోటో కనిపిస్తుంది. దీనిపై ఎంత గిట్టుబాటు అయితే అంత చేసుకోవచ్చు.

బట్టలు తగులబడుతున్నాయ్!

మన గ్రామాలలో బాణామతి, చేతబడి,దయ్యాలు, భూతాలు, పిశాచాలు, హస్తలాఘవాలు ఇంకా ఎన్నో జనాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటి ఆధారంగా ప్రజలను ఏడిపించే మంత్రగాళ్లు, భూతవైద్యులు, గ్రామవైద్యులు ఉండనేవున్నారు. అలాంటివారికి విపరీతమైన గౌరవం యిస్తూ, వారంటే భయపడుతూ వుండడంతో, వారు యింకా వ్యాపారం చేస్తున్నారు.