పుట:Abaddhala veta revised.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికాలో మతస్వేచ్ఛను స్వాములు బాగా దుర్వినియోగపరుస్తున్నారు. ఇతరులకు హాని చేయనంత వరకే మతస్వేచ్ఛను వాడుకోవాలని వున్నా, అన్ని మతాలు కూడా జనాన్ని పీల్చి, డబ్బు వసూలు చేస్తున్నాయి. రహస్య కార్యకలాపాలు సాగిస్తూ అనేక చిత్రహింసలపాలు చేస్తున్నాయి. పైగా ప్రభుత్వం జోక్యం చేసుకోగూడదంటున్నాయి! జెహోవా విట్ నెసెస్, అడల్ట్ క్రిష్టియన్ సైంటిస్టులు మతస్వేచ్ఛ పేరిట, రోగాలకు మందులు తీసుకోకుండానూ, రక్తమార్పిడి నిరాకరిస్తూ వున్నారు. అయితే పిల్లలకు సైతం యిలా చేయవచ్ఛా అనేది తీవ్ర చర్చనీయాంశం అయింది.

మత కార్యకలాపాలకు వచ్చే డబ్బుపై పన్ను వేయకపోవడంతో దుర్వినియోగం కూడా విపరీతంగా సాగిపోతున్నది. రానురాను కొందరు బయలుదేరి "దయ్యం వదలగొట్టే పనిలో నిమగ్నులమయ్యాం-మాకూ పన్ను మినహాయించండి" అని కోరారు.

టెక్సాస్ రాష్ట్రంలోను,వాకోలో ఏకాంతభవనంలో మారణాయుధాలు పెట్టుకొని, డేవిడ్ బ్రాంచ్ అనే క్రైస్తవశాఖ నాటకాలు ఆడింది. అందులోని పిల్లల్ని, తల్లుల్ని కాపాడాలని పోలీస్ ప్రయత్నిస్తేలోనుండి కాల్పులు జరిపారు. చివరకు ఎందరో చనిపోతేగాని, కొందరు బయటపడలేదు. గత సంవత్సరం జరిగిన యీ సంఘటన గమనిస్తే, మతం పేరిట నేటికీ ఎంత దారుణం జరుగుతున్నదో చూడవచ్చు. మతానికి ఆయుధాలు దేనికి?

మతం వ్యక్తిగత విషయంగా భావించి సంస్థాగతం నుండి తప్పిస్తే చాలామంది నాటకాలు అంతమౌతాయి. పన్నుల మినహాయింపు తీసేస్తే ఆదాయం పడిపోయి, అవినీతి తగ్గుతుంది. 1995 నాటికి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది, మూడవ ప్రపంచ యుద్ధానికి మించినదీ మతహింస మాత్రమే.

- హేతువాది, మే, జూన్,1995
బాబా ఏమైనా చేయగలడు!

సంసార స్త్రీలు తమ ఇళ్ళలో యిబ్బందుల్ని బాబాలకు, మాతలకు, సోది చెప్పేవారికి విన్నవించుకుంటారు. స్త్రీల చేతనే అన్నీ ఏదో విధంగా రాబడతారు. పరిష్కారం చెప్పినట్టు నటిస్తారు. ఈలోగా దక్షిణలు, కానుకలు, ఎన్నో స్వాములకు చేరిపోతాయి, కొన్ని సందర్భాలలో స్త్రీలను భయకంపితుల్ని చేసి, వారి నుండి లబ్ధిపొందే స్వాములూ వున్నారు. స్త్రీలలో నమ్మకాలు క్రమంగా వారి సంతానానికి సంక్రమిస్తాయి. గుడికి పోవడం, మొక్కుబడులు, తాయెత్తులు, ఒకటేమిటి? అన్ని లక్షణాలు చిన్నప్పటినుండే వస్తాయి. అవి పెద్ద అయినా పోవు.

హేతువాది ప్రేమానంద్ కు బొంబాయిలో యిలాంటి ఘట్టం ఒకటి తటస్తపడింది. ఒక బాబాచే బాధితురాలైన స్త్రీని విమోచన చేయమని ఆమె కుమారుడే వచ్చి కోరాడు. బాబా చేసిన