పుట:Abaddhala veta revised.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రభుత్వ దృష్టిలో అన్ని మతాలు సమానం అంటే, అన్నిటికీ సమాన దూరంగా వుండటమే అని గ్రహిస్తేచాలు. అదే సరైన సెక్యులరిజం అవుతుంది. మతాలు వున్నంతకాలం మతకలహాలు తప్పవు. కనుక మతాల్ని వ్యక్తిపరమైన విశ్వాసంగా అట్టిపెట్టి, పరిపాలించడం సెక్యులరిజం అనిపించుకుంటుంది.

- హేతువాది, ఆగస్టు 1984
అన్ని మన మూలగ్రంథాల్లో వున్నాయా?

అన్నీ మన వేదాలే చెప్పాయని నమ్మేవారున్నట్లే ఇతర దేశాల్లో అన్ని మతాల్లో శాశ్వత సత్యాల్ని నమ్మేవారున్నారు. అంతటితో ఆగకుండా, సైన్స్ ఏదయినా కొత్త అంశం కనుగొనగానే అది మనవాళ్ళెన్నడో చెప్పారని శ్లోకాలు వల్లించే వారున్నారు. క్రైస్తవులు బైబిల్ ని గుడ్డిగా నమ్మి, దానికోసం కోర్టులదాకా వెళ్ళి ఓడిపోయారంటే నమ్ముతారా? ఈ విశ్వమంతా బైబిల్ ప్రకారం సృష్టి అయిందని, అలాగే పిల్లలకు పాఠాలు చెప్పాలన్నారు. సైన్స్ రుజువు చేసిన పరిణామవాదాన్ని ప్రశ్నించారు. అమెరికాలో కోర్టులలో యీ సృష్టివాదాన్ని రుజువు చేయలేక వెల్లకిలా పడ్డారు. బైబిల్, వేదాలు, ఖురాన్ ఇత్యాది మతగ్రంథాలన్నీ ఆయా మతస్తులకి పవిత్రాలు, శిరోధార్యాలు కాని అవి కేవలం నమ్మకాలని విస్మరించి, వాస్తవాలన్నప్పుడే చిక్కొస్తుంది. పైగా సైన్సు ప్రకారం వున్నాయంటే మరీ ప్రమాదం.

అమెరికాలో కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్ ఫ్రిట్జ్ ఆఫ్ కాప్రా ఒక పుస్తకం రాశాడు. ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనే యీ గ్రంథం బాగా అమ్ముడు బోయింది. బహుళ ప్రచారంలోకి వచ్చింది. సైన్స్ లో నేడు శాస్త్రజ్ఞులు కనుగొన్నదంతా చైనాలో నాడే తెలుసుకున్నారని ఆయన పేర్కొన్న సారాంశం. ఇంకేముంది! జనం ఎగబడికొన్నారు. అందునా ఒక అమెరికా ఫిజిక్స్ ప్రొఫెసర్ రాశాడంటే అది పరమ సత్యమే అయివుంటుందని నమ్మే ఆసియా వాసులు చాలామంది వున్నారు. ఇండియాలో కూడా యీ నమ్మకం బాగావున్నది. సత్యసాయిబాబా, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి మొదలైన వారి గురించి పాశ్చాత్యులు రాస్తే, అదొక సర్టిఫికెట్ గా భావిస్తారు. తెల్లవారు రాసినా నల్లవారు చెప్పినా అందులో సత్యాసత్యాలు తెలుసుకోడానికి శాస్త్రీయ ప్రమాణాలు ఒకటేనని మరచిపోతారు.

చైనాలో ఇన్ అనేది హేతుబద్ధ ఆలోచనగానూ, యాంగ్ అనేది ఉద్వేగానికి సంబంధించినది గానూ భావిస్తారు. ఈ రెండూ ఒకే సత్యాన్ని రెండు కోణాలనుంచి చూస్తాయని అంటారు. టావో గ్రంథానికి ఆధునిక సైన్స్ రీత్యా కాప్రా భాష్యం చెప్పాడన్నాం గదా? ప్రాచీన చైనా గ్రంథాలలో చెప్పిందంతా చూస్తే ఆధునిక సైన్స్ అందులో వున్నట్లు కాప్రా నమ్మాడు. కనుక సైన్సు గొప్పతనం ఏమీలేదనీ, ప్రాచీనులు తమ దివ్యదృష్టి ద్వారా అన్నీ కనుగొన్నారనీ యిందలి