పుట:Abaddhala veta revised.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుద్వారా, మసీదు, దేవాలయాలను సందర్శించినా, ఎవ్వరూ నమ్మరు. పైగా ద్వేషం రగులుతూ కలహాలకు దారితీస్తుంది.

ప్రభుత్వ యంత్రాంగం కూడా నిష్పాక్షికంగా వుండకపోతే, పరిపాలన వలన అందరికీ సుఖం లభించదు. విజయవాడవద్ద కృష్ణపై వంతెనకు కనకదుర్గ అని పేరు పెడితే,ముస్లింలు, క్రైస్తవులు,నాస్తికులు ఎలా భావిస్తారు? రేడియో, టి.వి.లు అందరికోసం ఉద్దేశించారు. మతం ఒక వర్గానికి చెందినది. ఆయా మతస్తులు అనేక ఆచారవ్యవహారాలను పాటిస్తుంటారు. అప్పుడే కలహించుకుంటారు కూడా. మసీదు పక్కగా బాండ్ మేళాలతో పోతే కలహాలు వచ్చాయి. పంది మాంసం గురించి, ఆవు మాంసం గురించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ దృష్టిలో ఇవన్నీ లా అండ్ ఆర్డర్ సమస్యలుగానే వుండాలి. ఉద్యోగాలుచేసే వారికి రూల్స్ ఒకటే. మతపరమైన పండగవస్తే ఆ మతస్థులు సెలవు పెట్టుకోవాలి. అందరికీ సెలవు యివ్వడం అనవసరం. ఉద్యోగాలుచేసే ముస్లింలు ప్రార్థన పేరిట పోతామనడం కూడా సెక్యులర్ వ్యతిరేకమే. ఇతరులకు కష్టం కలిగించే వ్యవహారమే యిది. ఆఫీసుల్లో ప్రార్థన నిమిత్తం షెడ్లు నిర్మించమంటే, అన్ని మతస్తులు ఏదో ఒక కోరిక కోరతారు. దీనికి అంతం వుండదు. క్రమేణా కలహాలకు దారితీస్తుంది.

రేడియో,టి.వి.లలో మతప్రచారం ఎక్కువైంది. దీనివలన సమైక్యత చెడుతుందే గాని బాగుపడదు. వారానికి 5 రోజులు హిందువుల భజనచేసి, ఒకరోజు ముస్లింల ప్రార్థన, ఒకరోజు క్రైస్తవుల భక్తిగీతాలు వేస్తే అన్ని మతాలు ఒక్కటైనట్లు కాదు. పైగా ఒకే భక్తి గేయాల్ని తరచు వేయడం వలన మత ప్రచారం అనిపించుకుంటుందే గాని మతాన్ని గురించి చెప్పినట్లు కాదు.

మత ప్రచారం నిమిత్తం వివిధభారతిలో డబ్బిచ్చి కొనుక్కోవచ్చు. విదేశాలలో క్రైస్తవులు అలాగే చేస్తున్నారు. ఇష్టం వున్నవారు వింటారు. లేకుంటే లేదు. కాని ఆలిండియా రేడియో ప్రజలందరి కోసం, అందరి డబ్బుతో స్థాపించిన వ్యవస్థ. అక్కడ ప్రతి శనివారం వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తే అర్థం ఏమిటి?

ప్రభుత్వంలో కీలక స్థానంలోవున్న వ్యక్తులు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో సెక్యులరిజం పట్ల వేసిన తప్పటడుగు వలన నేటి దుష్పరిణామం వచ్చింది. రాజకీయ పార్టీలు మతాన్ని ఓట్లకోసం వినియోగించుకొనే దుస్థితికి దిగజార్చాయి. హైదరాబాద్ లో ఒక్కొక్క యేడు గణపతి ఉత్సవం జరుగుతుంటే హిందూ-ముస్లిం ద్వేషం ప్రబలిపోతూ వున్నది.

సమస్యను మూలానికి వెళ్ళి పరిశీలించకుండా, తాత్కాలిక ప్రయోజనాలతో దాటవేద్దామంటే యిలాగే వుంటుంది. మహాత్మగాంధీ రాం రహీం ఒక్కటే అంటే హిందువులు ఒప్పుకున్నారా? ముస్లింలు అంగీకరించారా? సెక్యులర్ సమస్యల్ని మతపరంగా చూస్తే పరిష్కారం లభించదు. ప్రతిమతం పుట్టడానికి, పెరగడానికి చారిత్రక కారణాలు వున్నాయి. వాటన్నిటినీ కాదని, ఒకే గాటిన అన్ని మతాలను కట్టేయడం సాధ్యంకాదు.