పుట:Abaddhala veta revised.pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సారాంశం. ఆధునిక అణు విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా ప్రాచీన టావో గ్రంథంలో యిమిడి వున్నదో కాప్రా రాశాడు. అలాగే వేదాలు, ఖురాన్ ,బైబుల్ గురించి చెబుతున్నవారున్నారు. ఇదంతా చాలా బాగున్నది నమ్మకస్తులకు తామరపై వేడినీరు పోసినట్లున్నది.

సైన్సు కనుగొనేవరకూ ఆగకుండా సమస్యలన్నీ పూర్వీకులు తమ గ్రంథాల ద్వారా ఎలా పరిష్కరించారో చెప్పేస్తే సరిపోతుందికాని అలా చెయ్యకుండా,సైన్స్ కనుగొనేవరకూ ఆగి అదంతా మా వేదాల్లో వుందని ఎందుకంటున్నారు?

మరొక ప్రధానమైన అంశం యీ నమ్మకస్తులు విస్మరించి యెప్పటికప్పుడు చావుదెబ్బ తింటున్నారు. సైన్స్ ఒకసారి కనిపెట్టిన విషయాన్ని,కొత్త సాక్షాధారాలు లభించిన తరువాత తృణీకరిస్తుంది. కొన్నిసార్లు సవరిస్తుంది. అప్పుడేమంటారు? వేదాలు, ఖురాన్ ,బైబిల్, టావో రచనలు కూడా అలా సవరిస్తారా? దివ్యశక్తి అనేది సైన్సులో కూడా వున్నది. సైంటిస్టు తన పరిశోధనకు పరిష్కారం లభించనప్పుడు ఆలోచిస్తూవుంటాడు. హఠాత్తుగా పరిష్కారం లభించినట్లు కల వస్తుందనుకోండి అదే పరమసత్యం అనడు. దానిని పరిశీలనకు, రుజువు పెడతాడు. దివ్యశక్తి కూడా అలా పరిశోధనకు గురిచేయడమే సైన్సు విశిష్ఠత. నమ్మకస్తులు యీ విషయం విస్మరించారు.

కాప్రా రాసిన టావో ఫిజిక్స్ గ్రంథాన్ని సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు ఇజెక్ అసిమోప్ పరిశీలించాడు. ఆయన అభిప్రాయాలు వెలిబుచ్చుతూ, సైన్స్ పరిశోధన చాలా ఖర్చుతో కూడిన పని. ప్రభుత్వాలు యీ ఖర్చును భరించలేకపోతున్నాయి. కనుక సైన్స్ యెదుర్కొంటున్న అనేక సమస్యలకు టావో ఫిజిక్స్ ఏం చెబుతున్నదో విడమరచి వివరించమని కోరాడు. అలా చెప్పగలిగితే కాప్రా ఎంతో సేవచేసినవాడే గాక, ఖర్చు శ్రమ మిగులుతాయి అని అసిమోవ్ సూచించాడు. ఇది వేదాంతులకు, బైబిల్,ఖురాన్ నమ్మకస్తులకూ వర్తిస్తుంది.

ఉదాహరణకు సూక్ష్మలోకంలో క్వార్క్ లనే అణువులు దేనితో ఏర్పడ్డాయో తెలియక సైన్స్ సతమతమౌతున్నది. దీన్ని గురించి టావో ఫిజిక్స్ యేమంటుంది?

అలాంటి క్వార్క్(Quarks) లు ఎన్ని ఉన్నాయి? ఎలక్ట్రాన్లు దేనితో ఏర్పడ్డాయి? భారమైన లెప్టాన్లు వున్నాయా? ఉంటే యెన్ని? క్వార్క్ లకూ లెప్టాన్లకూ సంబంధం ఏమిటి? ఇవన్నీ క్వాంటం సిద్ధాంతరీత్యా మౌలిక సందేహాలు. వీటికి సమాధానం టావో ఫిజిక్స్ లో యేమున్నదో చెప్పమని 1980లోనే అసిమోవ్ అడిగాడు. ఆయన చనిపోయాడు కూడా. 14 సంవత్సరాలైనా కాప్రా మాట్లాడలేదు. నమ్మకస్తులెవరూ నోరు విప్పలేదు.

సైన్స్ కనిపెట్టిన తరువాత ఏదో ఒక శ్లోకాన్ని, వాక్యాన్ని, సూత్రాన్ని పట్టుకొచ్చి, దీనికి అర్థం సైన్స్ చెప్పినట్లే వున్నదనడం ఫాషన్ అయింది. నమ్మేవారున్నంతకాలం ఇలాంటి మోసాలు సాగుతూనే వుంటాయి.